–ల్యాండ్ టైటిలింగ్ యాక్టు,
–కార్డ్ ప్రైమ్ 2.0 విధానం రద్దు
–సచివాలయాల్లో రిజిష్ట్రేషన్లు రద్దు
-సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దర్బార్ విధానానికి స్వస్తి
–మళ్ళీ అందుబాటులోకి నాసిక్ స్టాంపులు
Land Registration: ప్రజా దీవెన అమరావతి: గత ప్రభుత్వ హయాంలో రిజిష్ట్రేషన్ (Registration) శాఖ తీసుకున్న నిర్ణయాలు వికటించడంతో కొత్త ప్రభుత్వం వాటిల్లో మార్పులు తీసుకువస్తోంది. రెండు నెలల వ్యవధిలో తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు అమలులోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆ ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణమైంది. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యతనిచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు (Land Title Act) ను రద్దు చేసింది. ఆస్తుల వివాదాల పరిష్కారం న్యాయ వవస్ధ నుంచి మినహాయించి ప్రభుత్వ అధికారికి అప్పగించే ఈ చట్టం పట్ల ప్రజలు ఆందోళన చెందారు. ప్రభుత్వ అధికారి పాలకుల ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండటంతో తమ అస్తులకు భధ్రత ఉండదనే భయం ప్రజల్లో ఏర్పడింది. ఆ భయమే గత ప్రభుత్వ ఓటమికి కారణమైంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసింది.
ఆ తరువాత ప్రజలకు మరీ ఇబ్బంది కలిగించిన విధానం కార్డ్ ప్రైమ్ 2.0. రిజిస్ట్రేషన్ల కోసం ఈ విధానాన్ని గత సెప్టెంబరు 1 నుంచి అమలు చేస్తోంది. ఇక్కడ దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంటు రూపొందించుకోవాలి. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కావాలి. అందులో ఏ రకమైన డీడ్ రాయించుకోవాల్సి ఉంటుందో, దానికి సంబంధించిన ఫార్మాట్‌ను ఎంపిక చేసుకొని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్ రిజిస్ట్రార్‌కు లింకు రూపంలో పంపించాలి. సబ్ రిజిస్ట్రార్ దానిని పరిశీలించిన తరువాత ఏవైనా సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి మెయిల్ ద్వారా లింక్ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్ ద్వారానే మళ్లీ సబ్ రిజిస్ట్రార్‌కు పంపితే దానిని ఆయన ఓకే చేసిన తరువాత, పార్టీలు వేలిముద్ర (Finger Print) వేస్తే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయానికి వెళ్లి వేలిముద్ర వేయొచ్చు. సంతకాలతో సంబంధం ఉండదు. ఆ తరువాత సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంటును పీడీఎఫ్ రూపంలో దరఖాస్తుదారుడి మెయిల్‌కు పంపిస్తారు.
ప్రజల సెంటిమెంట్ కు భిన్నంగా కొత్త విధానం:
ఈ విధానంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లతో కూడిన డాక్యుమెంట్లు ఉండవు. అయితే ప్రజలు డాక్యుమెంట్లు మాన్యువల్ స్టాంపు పేపర్ల మీద ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే డాక్యుమెంటు రైటర్ ద్వారా రూపొందించే డాక్యుమెంటులో ఆస్తి తమకు ఎలా వచ్చిందన్న స్వభావం సమగ్రంగా ఉంటుంది. అయితే కొత్త విధానంలో డాక్యుమెంటులో అమ్మిన వ్యక్తి, కొన్నవ్యక్తి వివరాలు, విస్తీర్ణం, సర్వే నెంబరు, హద్దులు వంటివి మాత్రమే ఉంటాయి. స్వభావం, ఆస్తి మూలాలకు సంబంధించిన వివరాలు లేకపోవడంతో ప్రజలు నూతన విధానంపై విముఖత వ్యక్తం చేశారు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంటును రిజిష్ట్రేషన్ శాఖ దరఖాస్తుదారులకు పీడీఎఫ్ రూపంలో పంపుతున్నారు. దానిని ఎన్ని కాపీలైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొన్న కాపీలను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని ఈ విధానాన్ని వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు ప్రచారం చేశారు. దీనితో అనేక మంది కొనుగోలుదారులు నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు ఉండని కారణంగా రిజిష్ట్రేషన్లు వాయిదా వేసుకున్నారు. తమ వ్యతిరేకతను గత ఎన్నికలో ఓటు రూపంలో చూపించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని రద్దు చేసింది. కొనుగోలుదారులకు ఈ స్టాంపింగ్ విధానంలో రూపొందిచిన డాక్యుమెంట్లు ఇస్తోంది.
ఈ స్టాంపుల పట్ల కూడా వ్యతిరేకత:
రిజిస్ట్రేషన్ల వ్యవహారాలకు సంబంధించి.. నాన్ జ్యుడీషియల్ (Non Judicial) స్టాంప్‌ల కొరత, నకిలీ స్టాంప్ (Duplicate Stamps)ల విక్రయం, ట్యాంపరింగ్.. వంటి సమస్యలు అధికంగా ఉండటంతో గత ఏడాది ఏప్రిల్ 21న ఈ- స్టాంపింగ్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.. నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కన్నా, వీటి వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ స్టాంపుల డిజైన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. అవి పలచగా ఉన్నాయని, ఎక్కువ కాలం నిలవవనే అభిప్రాయం వ్యక్తం అయింది. వీటిన్నంటి కంటే నాన్ నాన్ జ్యుడీషియల్ స్టాంపు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఆ డాక్యుమెంట్లను ఫ్రజలు ఎక్కువగా ఆదరించారు. ఈ స్టాంపుల విధానం అమలులోకి వచ్చినా, ప్రజలు నాన్ జ్యుడీషియల్ స్టాంపుల పట్లనే ఎక్కువ ఆసక్తిని కనపరిచారు. ప్రజల మనోభావాలను గౌరవించిన కూటమి ప్రభుత్వం మళ్లీ నాన్ జ్యుడీషియల్ స్టాంపుల విక్రయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. నాసిక్ లో ముద్రితమయ్యే వీటిని అక్కడి నుంచి తీసుకువచ్చి అన్ని రిజిష్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికిగాను ఎన్ని స్టాంపులు అవసరం అవుతాయనే దానిపై జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. ఇప్పటికే 11.38 లక్ష్లల స్టాంపులకు ఇండెంట్ పెట్టారు. ఈ స్టాంపుల పట్ల ప్రజల మనోభావాలను రిజిష్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వానికి వివరించడంతో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుని నాన్ జ్యుడీషియల్ స్టాంపుల విక్రయాలకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అవి అందుబాటులోకి రానున్నాయి.
సచివాలయాల్లో రిజిష్ట్రేషన్లు రద్దు:
గత ప్రభుత్వం 2020 డిసెంబరు 21న ఈ విధానం అమలులోకి తీసుకువచ్చింది. ప్రజలు వీటిల్లో రిజిష్ట్రేషన్లు చేసుకోడానికి ఆసక్తి చూపకపోవడంతో ఉన్నతాధికారులు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయాల్లో రిజిష్ట్రేషన్లు చేయించడానికి ప్రయత్నించారు. సచివాలయాల్లో పని చేసే కార్యదర్శులకు శిక్ష్లణ ఇచ్చినా, కొంత మంది బదిలీ కావడం, మరి కొంత మంది ఆసక్తి చూపకపోవడంతో రిజిష్ట్రేషన్ల సంఖ్య పెరగలేదు. రెండేళ్లలో సుమారు 3,700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా.. ఇప్పటి వరకూ 5,000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయని అధికారులు అంటున్నారు. దీనివల్ల అదనపు ఖర్చు, మ్యాన్ పవర్ వేస్టేజ్ తో పాటు సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమీక్ష్లలో వివరించడంతో ఆ విధానాన్ని నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని దర్బార్ విధానానికి స్వస్తి:
ప్రస్తుతం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో (Sub register Office) మిగిలిన సిబ్బంది వేర్వేరు గదుల్లోనూ, సబ్ రిజిష్ట్రార్ ఒక ప్రత్యేక వేదికపైనున్న(కోర్టుల్లో ఉన్న రీతిలో) సీటుపై ఆశీనులవుతున్నారు. కొనుగోలుదారులు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ సీటు ముందు నిలబడి తమ పనులు చేయించుకునే పరిస్ధితి ఫ్రస్తుతం ఉంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ విధానం సరైంది కాదని, సబ్ రిజిష్ట్రార్ కూడా ప్రజలు, అక్కడి పని చేసే సిబ్బందికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంకా ఇది అమలులోకి రాలేదు. మొత్తం మీద రిజిష్ట్రేషన్ శాఖ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందుబాటులో, వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటోంది.