మృగంలా మారిన కానిస్టేబుల్
— నిరుపేద బాలికపై అత్యాచారం
–ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
ప్రజా దీవెన/ అనంతపురం: ఆపదలో వున్నవారిని రక్షించే బాధ్యతాయుతమైన పోలీస్ మృగంలా మారిన సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తే తండ్రిలా కాపాడాల్సిన సదరు కానిస్టేబుల్ మృగంలా మారి ఓ అమ్మాయి పై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన బిడ్డ అలనాపాలన చూసుకుంటున్న నిరుపేద బాలికపై కన్నేసిన సదరు కానిస్టేబుల్ ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన రమేష్ కానిస్టేబుల్ తో పాటు అతడి భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్. వీరికి ఓ ఆడపిల్ల సంతానం. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగులే కావడంతో అనంతపురంలో నివాసముంటున్నారు. దీంతో పాపను చూసుకోడానికి తెలిసినవారి ద్వారా గుత్తి ప్రాంతానికే చెందిన ఓ బాలికను నియమించుకున్నారు.
తమ ఇంట్లోనే ఉంటూ కూతురి అలనాపాలన చూసుకుంటున్న బాలికపై రమేష్ కన్నుపడింది.భార్య విధులకు వెళ్లినపుడు ఇంట్లోనే వుండి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇలా గడిచిన ఆరు మాసాలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న క్రమంలో బాలిక గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. అత్యాచారం, అబార్షన్ విషయాలు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.
బాలికకు చిత్ర హింసలు…
బాలిక నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకుని రమేష్ చిత్రహింసలకు గురిచేసేవాడు. లాఠీలతో కొడుతూ, గొంతుకు వైరు బిగించి నరకం చూపించేవాడు. రోజురోజుకు అతడి వికృత చేష్టలు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాలిక ధైర్యంచేసి తనపై గతకొంతకాలంగా జరుగుతున్న అఘాయిత్యాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో వారు కూతురిని కానిస్టేబుల్ ఇంటినుండి వెంటనే తీసుకెళ్లి బాలిక తల్లిదండ్రులు పోలీస్ ఉన్నతాధికారులను కలిసి కానిస్టేబుల్ రమేష్ పై ఫిర్యాదు చేసారు. దీంతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు నిoదితుడు కానిస్టేబుల్ రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.