Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tirumala is again a cheetah తిరుమలలో మళ్ళీ చిరుత హల్ చల్

తిరుమలలో మళ్ళీ చిరుత హల్ చల్

ప్రజా దీవెన/తిరుపతి: తిరుమలలో చిరుత మళ్లీ ప్రత్యక్షం కావడం తో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. లక్షిత అనే చిన్నారిని చిరుత చంపిన ఘటనతో టీటీడీ జాగ్రత్తల పరంగా ప్రక్షాళన చర్యలకు నడుంబిగించింది. ఈ క్రమంలో ఇవాళ నడకమార్గంలో మళ్లీ చిరుత కనిపించింది.

మెట్ల దగ్గరకు చిరుత రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. నడకదారిలో చిరుత కనిపించింది. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

భక్తులు భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు.100 మందికి కలిపి ఒక గుంపుగా పంపిస్తుండగా వారికి పైలట్‌గా ఒకరిని నియమిస్తున్నారు.

అటు చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది.రేపు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ జరగనుంది. కాలినడక మార్గాల, ఘాట్‌లలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఘాట్‌ రోడ్లలో ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.

సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించనుంది.ఆ తర్వాత బైక్‌లను కొండపైకి అనుమతించరు. ఇక 15 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతించరు. చిరుత దాడిలో మృతి చెందిన లక్షిత అంత్యక్రియలు ఇవాళ నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపారు. మృతదేహం వద్ద లక్షిత కుటుంబసభ్యులు రోదించగా గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు. అయితే ఘటన జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ భూమన పరిశీలించారు.

భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, లక్షిత సంఘటన బాధాకరమని ఆవేదన చెందారు. ఇలాంటి సంఘటనలను సాంకేతికంగా కూడా ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తామని టీటీడీ పేర్కొంది.

చిరుత చిక్కింది….

రెండు రోజుల క్రితంలో తిరుమ‌ల కొండ‌పై ఓ ఆరేండ్ల బాలిక‌పై చిరుత దాడి చేసి చంపిన విషయం విదితమే. దీనితో బాలిక మృత‌దేహం ల‌భించిన స్థ‌లంతో పాటు చుట్టుప‌క్క‌ల మూడు బోన్ల‌ను ఏర్పాటు చేశారు అధికారులు. తిరుమ‌ల – అలిపిరి న‌డ‌క‌మార్గంలోని ఏడో మైలు వ‌ద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమ‌వారం తెల్ల‌వారుజామున చిరుత చిక్కిందని తెలిపారు .సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టిన అధికారులు చిరుత చిక్కిన ప్రాంతానికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు.శుక్ర‌వారం నెల్లూరు జిల్లాకు చెందిన ల‌క్షిత‌(6) అనే చిన్నారి త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి అలిపిరి న‌డ‌క‌మార్గంలో వెళ్తుండ‌గా చిరుత దాడి చేసి చంపింది. గ‌తంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుత‌ను బంధించి క‌ల్యాణ ట్యాంక్ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో వ‌దిలిపెట్టారు. చిరుత‌ల దాడుల నేప‌థ్యంలో టీటీడీ అప్ర‌మ‌త్త‌మైంది. మ‌ధ్యాహ్నం త‌ర్వాత చిన్నారుల‌తో క‌లిసి న‌డ‌క మార్గంలో వెళ్లొద్ద‌ని టీటీడీ ఆదేశించింది.