Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Food poisoning: ఫుడ్ పాయిజన్ కేసులో ముగ్గురిపై వేటు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి)లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి విద్యార్థినులు భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

కోలుకున్న కొందరు విద్యార్థినులు
మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆగ్రహం

ప్రజాదీవెన, నర్సాపూర్: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి)లోని కేజీబీవీ(KGBV)లో శుక్రవారం రాత్రి విద్యార్థినులు భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. విద్యార్థినుల్లో తీవ్ర అస్వస్థతకు గురైన కొందరు విద్యార్థినుల(Students)ను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థినులు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

ఈ క్రమంలో పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ట్యాంకు వద్దకు వెళ్లి నీటిని పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాటర్ ట్యాంక్ పై కవర్ లేకపోవడాన్ని గమనించి.. వెంటనే వేయాలని చెప్పారు. విద్యార్థినులు తాగుతున్న మినరల్ వాటర్, వంటకు ఉపయోగించే బోర్ వాటర్ శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద పేరుకుపోయిన చెత్తను సైతం శుభ్రం చేయాలని ఆదేశించారు.

ముగ్గురిపై చర్యలు
మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు నిర్మల్ (Nirmal) డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని.. ముగ్గురు సహాయ వంట మనుషులను తొలగించినట్లు వెల్లడించారు. ఇంఛార్జీ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు కేజీబీవీలో అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు పలువురిని తాత్కాలికంగా నియమించారు.

హరీష్ రావు ఆగ్రహం
మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మొన్న భువనగిరి గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహారం తిని ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోయిన ఘటన మరువక ముందే మరో ఫుడ్ పాయిజన్(Food poison)ఘటన వెలుగులోకి రావడం దారుణం. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress government)డిమాండ్ చేస్తున్నాం.’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

తెలంగాణవ్యాప్తంగా ఇటీవల పలు గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత 50 రోజుల్లో ఇలా 135 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. భువనగిరి పాఠశాలలో ప్రశాంత్ (13) అనే విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందడం ఆందోళన కలిగించింది. శుక్రవారం పెద్దపల్లి సుల్తానాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి (Boys hostel)గృహంలో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మరువక ముందే.. కొన్ని గంటల్లోనే నిర్మల్ జిల్లాలో కేజీబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఇదే హాస్టల్ లో అల్పాహారం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

అప్పట్లో సిబ్బందిపై చర్యలు తీసుకోగా.. మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అటు, యాదాద్రిలోని సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, జనగాం పెంబర్తి గ్రామంలోని బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీకి చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలయ్యారు. అలాగే, నిర్మల్ లోని ముథోల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోనూ ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వరుస ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు(Parents) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Three accused in food poisoning case