Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 3:39 am Posted by : praja deveena

Tummala Veerareddy : అక్రమ అరెస్టులు సరికాదు

–కార్మికుల పెండింగు బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలి

–తుమ్మల వీరారెడ్డి

Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ : మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి యూనియన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కార్మికులపై ఉక్కు పాదం ఎక్కడికి అక్కడ ముందస్తు అరెస్టు చేయడం ఏమైంది కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. కార్మికులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు కొందరినీ హౌస్ అరెస్ట్ చేశారని కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని, ఇది సరైనది కాదని, ఒక నెల జీతం ఇవ్వకుంటే మీరు పని చేస్తారా జీతం అడిగితే అరెస్టు చేసుకుంటూ పోతారా మా గోడు అధికారులకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వరా అని పోలీసులను ప్రశ్నించారు. గురువారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్లగొండ సుభాష్ విగ్రహం వద్ద కార్మికులతో కలిసి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు సుమారుగా ఐదు నెలల నుంచి వేతనాలు, బిల్లులు, పది నెలల గుడ్ల బిల్లులు రాక కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని

 

ఈ సందర్భంలో తమ సమస్యలను విద్యాశాఖ కమిషనర్ కు విన్నవించుకోవడానికి బయలుదేరితే పోలీసులు ఎక్కడిక క్కడ కార్మికులను నిర్బంధించి భయాందోళనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజలు తమ సమస్యలను నిరసన రూపంలో వ్యక్తపరిచే హక్కు ఉందని తెలియపరుస్తూనే పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం కార్మికుల హక్కులను కాలరాయడమే అని మండిపడ్డారు. పోలీసుల అత్యుత్సాహంతో నిన్న జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన దాసరి రాజేశ్వరికి కిందపడి చేతికి గాయమైందని చేయి మొత్తం వాయ డంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని రెండు, మూడు వేల వేతనంతో ఎవరైనా బతుకుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? ఏనాడైనా ప్రభుత్వం తమను గుర్తించి ఆదుకుంటుందనే ఆశతో కార్మికులు అనేక సమస్యలను ఓర్చుకొని పిల్లలకు వంట చేసి పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల పెండింగ్ వేతనాలు బిల్లులు యూకుబేర్ నుంచి మినహాయించి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. వంటకు సరిపడా గ్యాస్ ను ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పై సమస్యలన్నీ పరిష్కారం చేయని యెడల సమ్మెలోకి పోవడానికి కూడా వెనకాడపోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడుతూ పథకం ప్రారంభమై సుమారు 25 సంవత్సరాల నుంచి కార్మికులు అనేక కష్టనష్టాలను భరిస్తూ పనిచేస్తున్నారని తమను ప్రభుత్వం ఏ రోజైనా గుర్తిస్తుందని ఒకే ఒక చిన్న ఆశతో పని చేస్తున్నారని అలాంటి కార్మికులను పోలీసులతో బెదిరించటం సరైనది కాదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దేబోరా, వెంకటమ్మ, శంకరమ్మ, సైదమ్మ, నిర్మల, అలివేలు, ముత్యాలి, సుశీల, పుష్పలత, ఇందిర తదితరులు పాల్గొన్నారు.