Doctors Launch Statewide Protest in Telangana: తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు చేపట్టిన నిరసనతో ప్రభుత్వ ఆస్పత్రు (Government Hospital)ల్లో సాధారణ వైద్య సేవలపై ప్రభావం పడనుంది. బదిలీల వ్యవహారంలో జీవో 38 నిబంధనలను పక్కన పెట్టారని ఆరోపిస్తూ వైద్య సంఘాలు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి.
ఈ ఉద్యమంలో సుమారు 5 వేల మంది వైద్యులు పాల్గొంటారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల (Telangana Government Doctors) సంఘం (టీజీజీడీఏ) వెల్లడించింది. ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
అయితే అత్యవసర వైద్య సేవలు, ఆస్పత్రుల్లో ఇప్పటికే చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్‌ల (in Patient) కు ఎలాంటి అంతరాయం ఉండదని సంఘం స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.
Also Read:Mega Job Fair Held in Mangalagiri: మంగళగిరిలో నేడు మెగా జాబ్ మేళా
వైద్యుల ప్రధాన డిమాండ్ జీవో 38ను పూర్తిస్థాయిలో అమలు చేయడమే. బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వైద్యుల్లో అసంతృప్తి పెరిగిందని సంఘం నేతలు తెలిపారు.
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని టీజీజీడీఏ హెచ్చరించింది. అంతేకాకుండా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలు సమర్పించబోరని స్పష్టం చేసింది.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 38 ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. సీనియారిటీ, భార్యాభర్తల పోస్టింగ్ ప్రాధాన్యత, పట్టణ-గ్రామీణ ప్రాంతాల సమతుల్యత వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నదే వైద్యుల ప్రధాన డిమాండ్‌గా మారింది.