Tamil Nadu CM Vijay Honors Chess Star: భారత చెస్ ప్రపంచంలో మరో చరిత్రను సృష్టించిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద(Praggnanandhaa)కు తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం నిర్వహించింది. నార్వే చెస్(Norway Chess) టోర్నీలో అద్భుత విజయం సాధించి దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచిన ఆయనను ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Vijay) ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున ప్రజ్ఞానందకు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేశారు. అలాగే జ్ఞాపికను బహూకరించి ఆయన విజయాన్ని కొనియాడారు. కార్యక్రమం అనంతరం సీఎం విజయ్ స్వయంగా ప్రజ్ఞానందతో కొద్దిసేపు చెస్ ఆడి ఆయనపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

నార్వేలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ప్రజ్ఞానంద అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. ప్రారంభ రౌండ్లలో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వరుస విజయాలతో తిరిగి పోటీలోకి వచ్చాడు. చివరికి టైటిల్‌ను సొంతం చేసుకుని భారత చెస్ చరిత్రలో తన పేరును నిలిపాడు.
ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (Magnus Carlsen)ను ఆయన సొంతగడ్డపై క్లాసికల్ విభాగంలో రెండుసార్లు ఓడించడం ఈ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో ప్రపంచ ఛాంపియన్(Chess Championship) డి. గుకేశ్‌పై కూడా విజయాన్ని నమోదు చేసి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.
ఆరో రౌండ్ ముగిసే సమయానికి పట్టికలో చివరి స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద, ఆ తర్వాత అద్భుత పునరాగమనంతో వరుసగా నాలుగు గేమ్‌లలో విజయం సాధించాడు. ఈ విజయాల పరంపర అతడిని నేరుగా టైటిల్ రేసులోకి తీసుకువచ్చింది. చివరి రౌండ్‌లో విన్సెంట్ కీమర్‌పై గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, క్రీడా శాఖ అధికారులు(Tamil Nadu Sports), ప్రజ్ఞానంద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయిలో భారత యువత సామర్థ్యాన్ని చాటిన ప్రజ్ఞానంద విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సాధించిన ఘనత భవిష్యత్ చెస్ ఆటగాళ్లకు ప్రేరణగా నిలవనుంది.