విద్వేషాల రెచ్చగొడుతున్న మతోన్మాద శక్తులు
ప్రజా దీవెన/నల్లగొండ: మతోన్మాద శక్తులు విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మధ్యన ఐక్యతను విచ్చిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయం లో దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) నల్లగొండ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం. బి నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రామ జన్మభూమిని ఆయుధంగా చేసుకున్నట్టే రాబోయే ఎన్నికల కోసం ఉమ్మడి పౌరస్మృతిని మోదీ ప్రభుత్వం ఎజెండాగా నిర్ణయించుకున్నది.
మహిళల సమానత్వం పేరుతో మైనార్టీలను, ఇతర జాతులను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ఉమ్మడి పౌరస్మృతి ఎలా ఉంటుందో డ్రాఫ్ట్ కూడా లేకుండానే ‘ఒకే దేశం, ఒకే చట్టం’ అంటూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లను రద్దుచేస్తూ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుంది. రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి మనుస్మృతిని దేశ పవిత్ర గ్రంథం గా ప్రవేశపెట్టాలని ఆర్ఎస్ఎస్ కుటిల యత్నాలు చేస్తుంది. వీటిని తిప్పి కొట్టాల్సిన గురుతర బాధ్యత నేటి యువతరం పైన ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు 15 శాతానికి తగ్గితే, ప్రైవేట్రంగ సంస్థలు 85 శాతానికి విస్తరించాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేనందువల్ల ఎస్సీలతో పాటు మహిళలు, వికలాంగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు.
ఈ సమావేశంలో బోలుగూరి నరసింహ, పరిగెల వెంకటేష్, బూడిద సురేష్, వెంకటయ్య, బి చంద్రమౌళి, సత్యం, ఉషయ్య, వేముల బుచ్చయ్య, బి రమేష్, పి శంకర్, పి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.