Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gadala Srinivas Rao: ఏమో అనుకున్నాడు.. ఏదో అయ్యాడు

కేసీఆర్ సర్కార్ హయాంలో దూకుడు
హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ వీఆర్ఎస్ ఆమోదం

Gadala Srinivas Rao: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు (Gadala Srinivas Rao) వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఆయన రాజకీయ ఆశలు ఆవిరయ్యాయి. ఇపుడు ఏమి చేస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సర్కార్ హయాంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌‌గా ఉన్న గడల శ్రీనివాస్‌ రాజకీయంగా ఎగాలని ఆశపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొలిటికల్ పంచ్‌ డైలాగ్‌లు పేల్చుతూ జనంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడొచ్చామ్‌ అన్నదికాదు బుల్లెట్‌ దిగిందా లేదా అంటూ సినిమా డైలాగ్‌లు దంచికొట్టారు. కొత్తగూడెం నా అడ్డా… ఇక్కడే పుట్టా, ఇక్కడ చస్తా అంటూ సెంటిమెంట్‌ కూడా పండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే బరిలోకి దిగుతానంటూ.. పవర్‌లో ఉండగానే, ర్యాలీలు, భేటీలతో (With rallies and meetings)హోరెత్తించారు. అయితే, కేసీఆర్‌ ఆశీస్సులు మాత్రం దక్కలేదు. చివరికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు.

హెల్త్ డైరెక్టర్ గా ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి,అప్పటి సీఎం కేసీఆర్ కు పరమ భక్తుడిగా రాజకీయ నేతలా ఎదగాలనుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉంటూనే, అతిగా రాజకీయ జోక్యం చేసుకుని, కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని హడావుడి చేశారు. చివరికి టికెట్ రాలేదు. ఆ తర్వాత ఎంపీ టికెట్ పై కర్చీఫ్ వేసినా.. ఫలితం దక్కలేదు. సీన్ కట్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఉద్యోగంలో కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి అధికారి నుంచి మహబూబాబాద్ అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది కొత్త సర్కార్. చివరికీ వీఆర్ఎస్ పెట్టుకోవడంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇపుడు గడల పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా..? ఆయన దారెటు అనే చర్చ నడుస్తోంది..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పని చేసిన గడల శ్రీనివాస్ రావు (Gadala Srinivas Rao) .. ఒక వెలుగు వెలిగారు. ఉన్నత అధికారి అనే కంటే అప్పటి సీఎం కేసీఆర్‌కు పరమ భక్తుడిగా డ్రామాలు ఆడారు. ఈయన గారి హడావుడి మాములుగా ఉండేది కాదు. టైం దొరికితే చాలు, ఆదివారం వచ్చిందంటే కొత్తగూడెంలో వాలిపోయేవారు. జీఎస్ఆర్ (brs) ట్రస్టు పేరుతో కొత్తగూడెంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశాలు, సభలు, ర్యాలీలతో హడావుడి చేసేవారు. అవసరం లేకున్నా కేసీఆర్‌ను అతిగా పొగడటం, ఏకంగా ఒకసారి ఆయన కాళ్ల మీద పడ్డారు. ఇది అప్పట్లో చర్చకు దారి తీసింది. అయినా కేసీఆర్ కాళ్ళపై పడటాన్ని ఈయన సమర్థించుకున్నారు.

అవకాశం వస్తే.. కొత్తగూడెం ప్రజలు కు సేవ చేసుకుని పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని.. రాజకీయ నేతలాగా సభలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేశారు. బీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ (mla) కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాను ఉన్నత స్థాయి అధికారి అనే విషయాన్ని మర్చిపోయి, రాజకీయ కార్యకలాపాలు..ఒక పార్టీ గా అనుకూలంగా నిర్వహించారు. దీంతో గడల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో అడ్రస్ లేకుండా పోయారు. కొత్తగూడెం వైపే కన్నెత్తి చూడలేదు.

బీఆర్ఎస్ ఓడిపోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వం (congress)అధికారంలోకి రావడంతో.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దీంతో ప్లేట్ మార్చి.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ టికెట్ కూడా రాలేదు. గడల రాజకీయ ఆశలు పూర్తిగా ఆవిరి అయ్యాయి. మారిన పరిణామాలతో అతని ఉద్యోగం లోనూ కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జులై 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జాబ్‌లో జాయిన్ కాకుండానే గడల శ్రీనివాస్ లాంగ్ లీవ్‌లో వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆమోదించడంతో.. ప్రస్తుతం అతను ఏమి చెయ్యబోతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఏదైనా పార్టీ నుంచి ఇస్తారా..; లేదా వెయిట్ చేస్తారా..; గడల దారెటు ..? అనే చర్చ జరు గుతోంది. అంతన్నాడు.. ఇంతన్నాడు చివరికి ఇలా అయ్యిందా.. అని అంటున్నారు కొత్తగూడెం పబ్లిక్..!