–ఔటర్‌కు ఆనుకొని ఉన్న 45 గ్రా మాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి
–ఆయా మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ
–మూడు జిల్లాల్లోని సదరు గ్రామా లు ఇక పై హైదరాబాద్ పరిధికి
Expansion of Greater Hyderabad: ప్రజా దీవెన హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో (Expansion of Greater Hyderabad) కీలక అడుగు పడింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ ఎంసీ) పరిధిని విస్తరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy)ప్రకటించిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగు రోడ్డు వరకూ జీహెచ్ఎంసీ (ghmc) పరిధిలోకి తీసుకొస్తామని ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగర పరిధిని పెంచి, ప్రగతి పథంలో నడిపిస్తామని ఇటీవల అసెంబ్లీలోనూ వెల్లడించారు. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అనేక సందర్భాల్లో తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా కీలక ముందడుగు పడింది. ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న 45 గ్రామాలను సమీప మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి తెలంగాణ పురపాలక చట్ట సవరణ ఆర్డినెన్స్ 2024ను జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎం.ఎస్ నంబరు 73ను విడుదల చేసింది.
అంటే ఇక ఆయా గ్రామాలు పంచాయతీలు కావు. అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించరు. మరోవైపు కొంతకాలం తర్వాత ఈ మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీ (ghmc) పరిధిలోకి తేనున్నారని సమాచారం. అందుకోసం చట్టసవరణ చేస్తారని తెలిసింది. మునిసిపాలిటీల్లోవిలీనం చేసిన ఈ 45 గ్రామాల్లో అత్యధికం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని 23 గ్రామాలను 7 పురపాలికల్లో విలీనం చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను 4 పురపాలికల్లో, సంగారెడ్డి జిల్లాలోని 11 గ్రామాలను 2 పురపాలికల్లో విలీనం చేశారు. ప్రస్తుతం మునిసిపాలిటీల్లో విలీనమవడం.. తర్వాత గ్రేటర్లో (grater)కూడా కలిపితే ఔటర్‌ను ఆనుకొని ఉన్న ఈ గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అదే సమయంలో ఇప్పటివరకు పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాలకు పెద్దగా పన్నుల్లేవు. విలీనమైనందున పన్నుల రాబడి కూడా బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.