Ganesh Puja Issue: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధాన మంత్రి మోదీ (Narendra modi) హాజరవడంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానా లున్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోదీ హాజరవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బుధవారం ప్రధాని మోదీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ (Chandra chood) ఇంటికి వెళ్లి గణపతి పూజ (Ganesh Puja ) లో పాల్గొనడంతో పాటు హారతి కూడా ఇచ్చారు. మోదీకి సీజేఐ దంపతులు స్వాగతం పలికారు. ఈ ఫొటోలు, వీడియోను మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పుపట్టారు.
ప్రధాని మోదీతో కలిసి సీజేఐ తన నివా సంలో గణపతికి హారతి ఇచ్చారని, అయితే రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను కలవడంపై ప్రజలు అనుమానాలు వ్య క్తం చేస్తున్నారని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ‘మా కేసు సీజేఐ ముందు విచారణ జరుగుతోంది. మాకు న్యాయం జరుగుతుందా..? అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి. ఆ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తున్నారు’ అని రౌత్ పేర్కొన్నారు.
మరో నేత ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) కూడా విమర్శలు గుప్పించారు. మోదీ, సీజేఐల కలయికను త్వరలో మహా రాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి ఆశ్చర్యపో యినట్లు చెప్పారు. అయితే సీజేఐపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ.. అత్యున్నత స్థానాల్లో వ్యక్తులు తమ వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోకూ డదన్నారు. సీజేఐ వ్యక్తిత్వంపై తనకు అపార గౌరవం ఉందని చెప్పారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. సీజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయిందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు. వినాయక పూజ అనేది వ్యక్తిగతమని.. ప్రధాని, సీజేఐ వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు ఆ ఫొటోలను బహిరంగపర్చడం సరికాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా (Manoj Sha ) అన్నారు.
ఇక ప్రతిపక్షాలపై బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రతిపక్షాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తాయి. సర్వోన్నత న్యాయస్థానం పట్ల వారు చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నాయి. బీజేపీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. గతంలో ప్రధాని మన్మోహన్సింగ్ (Manmohan singh) ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అప్పటి సీజేఐ హాజరవలేదా? అని ప్రశ్నించారు. ప్రధాని వెళ్లి సీజేఐని కలిస్తే అభ్యంతరం లేదని, గణపతిపూజలో పాల్గొనడమే వారికి బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ సీజేఐని కలిస్తే మీకు అభ్యంతరం. కానీ, రాహుల్ గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీరుకు మద్దతు పలికే అమెరికా చట్ట సభ సభ్యుడు ఇల్హాన్ ఒమర్‌ను కలిస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఇదెక్కడి విడ్డూరం’’ అని పాత్రా ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు