Nine years of stability contributes to the development of the country: తొమ్మిదేళ్ళ స్థిరత్వమే దేశాభివృద్ధికి దోహదం
-- దేశం అభివృద్ధిపధంలో దూసుకెళ్తోంది -- 2047 నాటికి భారతదేశం అగ్రదేశంగా మారుతుంది --అవినీతి, కులతత్వం, మతతత్వానికి జాతీయ జీవితంలో స్థానం ఉండదు
తొమ్మిదేళ్ళ స్థిరత్వమే దేశాభివృద్ధికి దోహదం
— దేశం అభివృద్ధిపధంలో దూసుకెళ్తోంది
— 2047 నాటికి భారతదేశం అగ్రదేశంగా మారుతుంది
–అవినీతి, కులతత్వం, మతతత్వానికి జాతీయ జీవితంలో స్థానం ఉండదు
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: భారతదేశంలో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ స్థిరత్వం అనేక సంస్కరణలకు, దేశ వృద్దికి కారణమైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్న క్రమంలో ప్రధాని మోదీ ఓ వార్తాసంస్ధ తో అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రధాని మోదీ పలు అంశాలపై స్పందిస్తూ ‘2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన అగ్ర దేశంగా మారుతుందని, అవినీతి, కులతత్వం, మతతత్వానికి మన జాతీయ జీవితంలో స్థానం ఉండదని మోదీ ఉద్ఘాటించారు. జీ 20లో భారత్ మాటలు, దార్శనికతలను ప్రపంచం భవిష్యత్‌కు రోడ్‌మ్యాప్‌గా చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు.
భారతదేశం దార్శనికతలు కేవలం ఆలోచనలు కావని భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ నుంచి అనేక సానుకూల ప్రభావాలు బయటకు వస్తున్నాయని అన్నారు. జీడీపీ కేంద్రీకృత దృక్పథం నుంచి ప్రపంచం ఇప్పుడు మానవ కేంద్రీకృత దృక్పథానికి మారుతోందని చెప్పారు. భారతదేశం ఇందులో ఉత్ప్రేరకం పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై మోదీ స్పందిస్తూ వివిధ ప్రాంతాలలో విభిన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం మాత్రమే మార్గమని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై పోరాటంలో గ్లోబల్ సహకారం అనివార్యం అని పేర్కొన్నారు. అక్రమ ఆర్థిక కార్యకలాపాలు, ఉగ్రవాదంపై పోరుకు సైబర్‌స్పేస్ పూర్తిగా కొత్త కోణాన్ని పరిచయం చేసిందని చెప్పారు.
సైబర్ బెదిరింపులు చాలా తీవ్రంగా తీసుకోవాల్సి ఉందన్నారు. సైబర్ టెర్రరిజం, ఆన్లైన్ రాడికలైజేషన్, మనీలాండరింగ్ మంచుకొండ వంటివని అన్నారు.దుర్మార్గపు లక్ష్యాలను నెరవేర్చడానికి డార్క్‌నెట్, మెటావర్స్, క్రిప్టోకరెన్సీని ఉపయోగిస్తున్న తీవ్రవాదులు దేశాల సామాజిక నిర్మాణంపై ప్రభావం చూపవచ్చని మోదీ అన్నారు. నకిలీ వార్తలు గందరగోళానికి కారణమవుతాయని, సామాజిక అశాంతికి ఆజ్యం పోయడానికి ఉపయోగపడతాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.