జనవరిలోనే జమిలి జరగనున్నాయా
— ఊతమిస్తున్న సి ఇ సి వ్యాఖ్యలు
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: దేశాన్నే కుదిపేస్తోన్న జమిలి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామన్న ధీమాతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న సంకేతాలు రోజు రోజుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (CEC) రాజీవ్ కుమార్ తాజాగా చేసిన ప్రకటన అవుననే అనిపిస్తుంది.
ప్రభుత్వ కాల పరిమితి ఐదేళ్లూ పూర్తవ్వకుండానే, 6 నెలల ముందుగానే ఎన్నికలు జరిపే అధికారం తమకు ఉoదని కేంద్రమైనా, రాష్ట్రాల విషయంలోనైనా ఈ రూల్ వర్తిస్తుందని వివరించారు. సాధారణంగా అయితే సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్ లేదా మేలో జరుగుతాయి.
ఈసారి ముందస్తుగా జరపాలి అనుకుంటే డిసెంబర్ లేదా జనవరిలో జరిపే ఛాన్స్ ఉంది. ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రాజీవ్ కుమార్ మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో మీడియా సమావేశంలో తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రానికీ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది జమిలి ఎన్నికల విధానం.
కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలకు కలిపి మినీ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు CEC రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.లోక్‌సభతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారని తెలుస్తోంది.
జమిలి ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీకాలం ముగిసినా, మరికొన్ని రోజులు కొనసాగిస్తూ, పదవీ కాలం ఉన్న అసెంబ్లీలకు గడువు కాలాన్ని తగ్గిస్తూ ఒకేసారి ఎన్నికలు జరిపే అవకాశాలు ఉంటాయి.
డిసెంబర్‌లో ముగిసే తెలంగాణ అసెంబ్లీకీ , 2024 మేలో ముగిసే ఏపీ అసెంబ్లీకీ ఒకేసారి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. జమిలి ఎన్నికల కోసం కేంద్రం ఇప్పుడు రాజ్యాంగ సవరణలేవీ చెయ్యాల్సిన అవసరం లేదని CEC రాజీవ్ కుమార్ తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్రం మాత్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యంలో ఓ అధ్యయన కమిటీని వేసింది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా జమిలి ఎన్నికలు జరపాలో, వద్దో నిర్ణయించుకుంటుంది.