మొరాకో లో మృత్యు ఘోష
— 2వేలు దాటిన మరణాలు
— మరో 2వేల పైనే క్షతగాత్రులు
ప్రజా దీవెన/మొరాకో: ఆఫ్రికా దేశమైన మొరాకోలో సంభవించిన పెను విధ్వంసక భూకంపంలో 2వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. భూకంపం సంభవించి రెండు రోజుల గడిచిన తర్వాత సదరు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 2,012 కు చేరిందంటే, అదే విధంగా 2,059 మందికి పైగా గాయపడి వీరిలో కూడా 1,404 మంది పరిస్థితి విషమంగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపిందంటే భూకంపం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అర్థరాత్రి వేళ భూకంపం రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను మొరాకన్లు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భవనాలు కూలిపోయి శిధిలాలుగా మారడం, చుట్టూ దుమ్ము అవరించడం కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న పట్టణ అధిపతి మొరాకన్ మీడియాతో మాట్లాడుతూ సమీపంలోని పట్టణాల్లోని అనేక ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా కూలిపోయాయని, కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనీ, రోడ్లు మూసుకుపోయాయని చెప్పారు.
తలాత్ న్ యాకూబ్ నగర అధిపతి అబ్దర్‌రహీమ్ ఐత్ దౌద్ మాట్లాడుతూ అధికారులు ప్రావిన్స్‌లో రోడ్లను క్లియర్ చేస్తున్నారని, అంబులెన్స్‌లు వెళ్లి బాధిత జనాభాకు సహాయం అందించవచ్చని చెప్పారు. భూకంప కేంద్రం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతానికి వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది.
మొరాకో సైనిక, అత్యవసర సిబ్బంది దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భూకంప కేంద్రం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతంలోకి వెళ్లే రహదారుల్లో శిధిలాలు, రాళ్లు పడటంతో సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. రెస్క్యూ కార్యకలాపాలు మందగించాయి.