ప్రజా దీవెన, హైదరాబాద్: భగవద్గీత అనేది గ్రంధాల సారాంశం, అందుకే దీనిని ఉపనిషత్తు అని కూడా అంటారు. ఉపనిషత్తు అంటే దగ్గరగా కూర్చొని చెప్పేది. మానసిక సామీప్యత వచ్చేవరకు వక్త మరియు శ్రోత మధ్య చాలా దూరం ఉంటుంది. వక్త ఏదో చెప్తే, శ్రోత తనకు నచ్చినదే అందులో గ్రహిస్తాడు. అందుకే శ్రోత, వక్తకు దగ్గరగా వచ్చి కూర్చొని అర్జునుడు అవ్వాలి. అర్జునుడు అంటే ఎవరు? జ్ఞాన పిపాస ఉన్నవాడు, ఏదైనా నేర్చుకోవాలనుకునేవాడు, తెలుసుకోవాలనుకునేవాడు, మరియు ముక్తి పొందాలి అనుకునేవాడు. అర్జునుడు అయినప్పుడే కృష్ణుడిని పొందగలవు.
మనందరి జీవితం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. పిల్లలు మూడు సంవత్సరాల వయస్సు నుండి ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తారు. అడగకుండా ఏదైనా చెప్పడం బుద్ధిమంతుల లక్షణం కాదు. అలాగే మహాభారతంలో అంతర్భాగమైన భగవద్గీత కూడా ఒక ప్రశ్నతో – యుద్ధభూమిలో అర్జునుడు మొదలైంది. యుద్ధభూమిలో అర్జునుడు పూర్తిగా కృంగిపోయి, అంధకారంలో ఉన్నప్పుడు శ్రీ కృష్ణుడు అతనికి భగవద్గీతను బోధించాడు. ఎవరైనా దుఃఖం, బాధ, ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్గీత నేటికీ కూడా ఎంతో అవసరం.
మహాభారత యుద్ధం తర్వాత ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు “ఓ కృష్ణా! యుద్ధ సమయంలో చాలా గందరగోళంగా ఉండేది. అప్పుడు నేను విచారంగా ఉన్నాను. ఆ యుద్ధ వాతావరణంలో మీరు నాకు గీతని బోధించారు. కానీ ఆ సమయంలో నాకు గీత ఎంతగా అర్ధమయ్యిందో తెలియదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు గీత వినాలనిపిస్తోంది. నాకు గీతను బోధించండి.”
అప్పుడు శ్రీ కృష్ణుడు సమాధానమిచ్చాడు “మహాభారత సమయంలో గీత నా నుండి ఉద్భవించింది. ఆ సమయంలో నేను ఏది చెప్పానో, ఇప్పుడు దానిని పునరావృతం
చేయలేను.”
గీతకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒక మహాత్ముని జయంతికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, గీతా జయంతికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. గీతా జయంతి జరుపుకోవడానికి ఇదే కారణం. గీత భగవంతుని వాణి, పూర్ణబ్రహ్మ వాణి.
గీతను యోగ విద్య అని కూడా అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగా యొక్క మూడు మార్గాలు భక్తి, క్రియ, మరియు జ్ఞానంని ముక్తికి సాధనాలుగా వివరించాడు. ఈ రోజుల్లో మనం యోగాను శారీరక వ్యాయామంగా మాత్రమే భావిస్తున్నాము. కానీ యోగా కేవలం శారీరక వ్యాయామం కాదు. అలాగే ప్రాణాయామం కూడా కేవలం ఊపిరి తీసుకుని విడిచే ప్రక్రియ మాత్రమే కాదు. యోగా మరియు ప్రాణాయామం రెండూ కూడా మనల్ని జీవితం యొక్క పరమ లక్ష్యం వైపు తీసుకుని వెళ్లే మార్గాలు. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి.
భగవంతుని వాణి అయిన గీత మన దేశంలో ఐదు వేల సంవత్సరాలుగా ఉంది. మీరు అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లి బైబిల్ చదివారా అని అడిగితే, అక్కడి ప్రజలు దానిని చదివామని చెబుతారు. కానీ మనదేశంలో ఎవరినైనా గీత చదివారా అని అడిగీతే, చాలామంది మౌనంగా ఉంటారు. జీవితం నుండి దుఃఖాన్ని తొలగించడానికి జ్ఞానం కంటే గొప్ప సాధనం ఏదీ లేదు. కాబట్టి గీత చదవండి. అలాగే ఒక్కసారి గీత చదివితే సరిపోదు. మళ్లీ మళ్లీ చదవండి.
–గురుదేవ్ శ్రీ శ్రీ పండిట్ రవిశంకర్ జీ
SriSri Ravishankar