ప్రజాదీవెన, ఢిల్లీ: ఫోర్బ్స్ 2024 సంవత్సరానికిగాను విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో భారత్ నుంచి ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్రస్థానం సంపాదించుకున్నారు. వాస్తవానికి ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ ఉండడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం.
ముచ్చటగా ముగ్గురు
ఫోర్బ్స్ – ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ 28వ స్థానంలో నిలిచారు. గతేడాది ఆమె 32వ స్థానంలో ఉండగా, ఇప్పుడు మరో నాలుగు స్థానాలు ఎగబాకడం విశేషం. ఇక, భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఈమె 60వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గతేడాది కూడా ఆమె ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళగా చోటు దక్కించుకున్నారు.
నంబర్ 1 మహిళ
ఫోర్బ్స్ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు, మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ (8వ స్థానం), అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాజీ సతీమణి మెకంజీ స్కాట్ (9వ స్థానం), ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ (23 వ స్థానం) లాంటివారు ఈ జాబితాలో ఉన్నారు.
ఇండియాలో తొలి, పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్, రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్ అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు.హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్ కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా. జులై 2020లో హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అగ్ర పథంలో నడిపిస్తున్నారని ఫోర్బ్స్ తెలిపింది.
1978లో కిరణ్ మజూందర్ షా బయోకాన్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో ఆమె భారత్‌లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరుగా ఎదిగారు. బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్ పరిశ్రమ ఉంది.