ప్రజాదీవెన, నల్గొండ టౌన్: డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్తలను సేకరించాలన్నారు.శుక్రవారం ఆమె నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చందనపల్లి లో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వల్ల తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, డంపింగ్ యార్డ్ లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు వర్మి కంపోస్టు తయారుపై దృష్టి సారించాలని చెప్పారు.
డంపింగ్ యార్డ్ ద్వారా చెత్త రీసైక్లింగ్, డిస్పోస్ చేయడంపై సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న స్థలంలో స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. స్లాటర్ హౌస్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని మున్సిపల్ అధికారులకు ఆమె తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ శేషమ్మ గూడలో ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సైతం తనిఖీ చేశారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాసులు, మరియు మున్సిపల్ ఇంజనీర్లు మరియు సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.