ప్రజాదీవెన, అమెరికా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ట్రంప్ పేరు వింటేనే అమెరికాలోని అక్రమ వలసదారుల వెన్నులో వణుకు పడుతోంది. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను తీసుకొస్తానని, అక్రమంగా దేశంలోని వచ్చిన వారిని తరిమేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ట్రంప్ చెప్పారు.
ఆయన చెప్పినట్లుగానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందు కార్యాచరణను ట్రంప్ మొదలు పెట్టారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆ దేశంలో అక్రమ వలసదారుల డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. అమెరికాలో మొత్తంగా అక్రమంగా వలస ఉంటున్నవారి సంఖ్య 14.45 లక్షలు కాగా.. అందులో 17,940 మంది భారతీయులు ఉన్నట్లు తేలింది. ఇందులో గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వీరందరికీ డిపోర్టేషన్ ముప్పు తప్పదని తెలుస్తుంది. దీంతో సరైన డాక్యుమెంట్లు లేని ఇండియన్లు తమ స్టేటస్ ను చట్టబద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
208 దేశాలకు చెందిన అక్రమ వలసదారులు అమెరికాలో డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటుండగా.. అందులో భారత్ 13వ స్థానంలో ఉందట. అయితే, గత మూడు సంవత్సరాల్లో అక్రమ మార్గాల్లో అగ్రరాజ్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిలో సగటున 90వేల మంది భారతీయులు పట్టుబడినట్లు ఐసీఈ నివేదికలు చెబుతున్నాయి.