ప్రజా దీవెన, హైదరాబాద్: డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది.డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్ ఫెడ్లర్లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం.. ఆపై బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది.
ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలామంది డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. చాలాసార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఎల్బీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.
కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల మాదకద్రవ్యాలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్‌ను మీర్పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ SOT పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి కోటి 25 లక్షల విలువచేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించనున్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. గసగసాల , FM వంటి మాదక ద్రవ్యాలను మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి తరలిస్తుండగా పట్టుకున్నారు..