ప్రజా దీవెన, హైదరాబాద్:జమిలి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై సస్సెన్స్ నెలకొంది. లోక్‌సభ బిజినెస్ షెడ్యూల్‌లో ఈ బిల్లు లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మరి, ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడ్తారా? లేక వాయిదా వేస్తారా?. జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన చేస్తునట్టు తెలుస్తోంది. సోమవారం లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను తొలగించడమే ఇందుకు కారణం. వన్‌నేషన్ ..వన్ ఎలక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అంతా రెడీ అయ్యింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది కానీ.. తాజాగా, రివైజ్డ్ లోక్‌సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు మాయమైనట్టు చెబుతున్నారు.
ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఈ సమావేశాల్లో జమిలి బిల్లును ప్రవేశపెట్టడంపై సందిగ్థత నెలకొంది. అయితే.. మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.పార్లమెంట్‌తో రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ ఆర్టికల్‌ను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం..ఆర్టికల్ 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు..ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. ఆర్టికల్ 327ను సవరించాల్సి ఉంటుంది.
వాస్తవానికి లోక్‌సభ, అసెంబ్లీలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్ర కేబినెట్ పక్కనబెట్టి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది.
లోక్‌సభలో మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం
జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి లోక్‌సభలో మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం.. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరంగా కాగా.. ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది.. ఇండి కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. వాస్తవానికి బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తరువాత జేపీసీకి పంపిస్తారని ప్రచారం జరిగింది.
జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో రద్దయినా… ఆయా అసెంబ్లీలు /లోక్‌సభకు మాత్రమే…ఐదేళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్‌సభతో పాటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.