ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్బంగా ఈ సంవత్సరం జనవరిలో ఇందిరమ్మండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు వచ్చే బృందాలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.మంగళవారం ఆమె అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నదని, అందువలన గతంలో ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని ఉండి, ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో పేరు ఉన్న దరఖాస్తుదారులు వారి దరఖాస్తుల పరిశీలనకు వచ్చే పరిశీలన బృందాలకు అందుబాటులో ఉండాలని కోరారు.
సర్వే బృందాలకు ప్రస్తుతం ఉన్న ఇంటి వివరాలు ఫోటోతో సహా ఇవ్వాలని, అలాగే నూతనంగా ఇల్లు నిర్మించుకునేవారైతే స్థలం వివరాలను సమర్పించాలని తెలిపారు. ఈ విషయంపై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలు,మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, అన్ని చోట్ల టామ్ టామ్ వేయించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఇదివరకే ప్రారంభమైందని, కొన్ని మండలాలు బాగా చేస్తున్నప్పటికీ మరికొన్ని మండలాల్లో పురోగతి తక్కువగా ఉందని ,తక్కువ ఉన్న మండలాలలో అందుకుగల కారణాలతో పాటు విశ్లేషణ చేసి నివేదిక సమర్పించాలని , ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో పేర్లు ఉన్న దరఖాస్తుదారుల వివరాలను ముందే ఆయా గ్రామాలు ,పట్టణ ప్రాంతాలలో ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
ఏదైనా కారణం చేత జనవరిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేయని వారు ఇప్పుడు మండల కేంద్రాలలో ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే ఎల్ పి జి సిలిండర్ కావాలనుకునే వారు, గతంలో దరఖాస్తు చేసుకొనని వారు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన యుద్ధ ప్రాతిపదికన చేయాలని, 500 దాటిన చోట ప్రతి మండలానికి ఒక కొత్త యూజర్ ఐడి క్రియేట్ చేయాలని చెప్పారు.గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్ ,మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీవోలు , తహశీల్దార్లు,ఎంపీడీవోలు ఈ టెలికాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.