చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురువనుందా
— ఇవ్వాళ, రేపు ప్రశ్నిoచనున్న సీఐడీ అధికారులు
— సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలో 9 అధికారులు
ప్రజా దీవెన/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టైన నారా చంద్రబాబు నాయుడును సిఐడి అధికారుల బృందం ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయనుందా అన్న చర్చోపచర్చలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. తాజాగా కస్టడీ తీసుకున్న సిఐడి ఇవ్వాళ రేపు రెండు రోజుల పాటు విచారించనుoది.
దీంతో అందరూ అనుకుంటున్నట్లు గానే సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఆయితే విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారని , రెండు రోజుల పాటు ఎన్ని ప్రశ్నలు వేయనున్నారనే అంశాలపై బాబు సమాధానం ఎలా ఉంటుంది అనేవి ఆసక్తిగా మారాయి.
సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలో 9 మంది విచారణ బృందం మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనుoడగా సమారు 9గంటల 30నిముషాలకు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం కానుంది. విచారణ అధికారులుగా ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో పాటు ఎఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు.
సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లోనే సీఐడీ బృందం విచారించనుంది. ఏసీబీ కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగనుండగా విచారణ మొత్తాన్ని వీడియో గ్రాఫర్, ఇద్దరు టైపిస్టులు రికార్డ్ చేయనున్నారు. చంద్రబాబు తరుపు న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది.
ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనున్న విచారణలో ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వనుండగా మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రధానంగా 30కి పైగా అంశాలపై సీఐడీ బృందం ప్రశ్నించనుంది.
ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో బాబుపై 34 అభియోగాలు మోపిన సీఐడీ తప్పుడు పత్రాలు సృష్టించటం, నిధులు మళ్లింపు, సిమన్స్ ఒప్పందం, జిఓ 4, నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ, ఆధారాలు డిస్ట్రాయ్ చెయ్యటం, 13 నోట్ ఫైల్స్‌పై బాబు సంతకాలు, ఐటీని లెక్కచెయ్యకపోవటం, షెల్ కంపెనీలు, అధికారులపై ఒత్తిడి లాంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన ఫైల్స్‌ను చంద్రబాబు ఎదుట పెట్టి విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. చిట్టచివరి లబ్దిదారులు ఎవరు అనే దానిపై ఇప్పటికే ఫోకస్ చేసిన సీఐడీ లోకేష్, కిలారి రాజేష్, పీస్ శ్రీనివాస్ పాత్రపై కూడా విచారించనుంది.