Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Alugubelli Narsireddy : టీఎస్ యుటిఎఫ్ 6వ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయండి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : టిఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డిసెంబర్ 28, 29, 30 తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలో గల లక్ష్మీ గార్డెన్ నందు అమరజీవి కామ్రేడ్ షేక్ మహబూబ్ అలీ ప్రాంగణం, కామ్రేడ్ ఎన్ బలరాం వేదిక నందు టీఎస్ యుటిఎఫ్ ఆరవ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభలు జరుగుతాయని మొదటి రోజు ప్రారంభంగా బహిరంగ సభ జరుగుతుందని ఈ సభకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్రంలోని విద్యా, సామాజిక విశ్లేషకులు హాజరవుతున్నారని మరియు రాష్ట్ర నలుమూలల నుండి 6 నుండి 7 వేల మంది హాజరవుతారని అన్నారు. 29, 30 తేదీలలో సంఘ ప్రతినిధులతో సభ జరుగుతుంది.

ఈ విద్యా, వైజ్ఞానిక మహాసభలలో ప్రభుత్వ విద్యా రంగం ఏ విధంగా ఉంది, ఎలా అభివృద్ధి చెందాలి, ప్రజలు ప్రభుత్వ విద్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారు లాంటి విద్యా విషయ అంశాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగమును అభివృద్ధి చేయకుండా ఉందని కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ఉపాధ్యాయుల ఖాళీలు నింపకుండా అలసత్వం చేసిందని కేవలం 5 నుండి 6 వందల గురుకులాలు అరకొరా వసతులతో ప్రారంభించి గురుకులాలలోనే మొత్తం విద్య అందుతుందని ప్రజలకు భ్రమలు కల్పించారు. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. కొత్త ప్రభుత్వం విద్యారంగంపై శ్రద్ధ పెడుతున్నట్టుగా కనబడుతుంది. అన్ని మేనేజ్మెంట్లలో సుమారు 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, దాదాపు 35,000 మంది ఉపాధ్యాయులకు బదిలీలు కల్పించారు.

గత ప్రభుత్వం ప్రభుత్వ బడులలో ఉన్న స్కావెంజలు తొలగించి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేయించాలని ఉత్తర్వులు జారీ చేయగా ఎమ్మెల్సీగా శాసన మండలిలో నేను సంఘంగా టీఎస్ యుటిఎఫ్ ఇది సాధ్యం కాదని వ్యతిరేకించడం జరిగింది, అయినా గత ప్రభుత్వం పెడచెవిని పెట్టింది‌. పాఠశాల పారిశుధ్యం నిర్వహణ ఉపాధ్యాయులకు కష్టంగా మార్చింది‌. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలో స్కావెంజర్ల నియామకానికి నిధులు విడుదల చేసి, బడులలో ఉచిత విద్యుత్ కల్పించడం జరిగింది. పాఠశాల విద్యా అనగా ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ శాఖ, ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి. ఈ బడులలో సుమారు 28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో కాస్త మెరుగుదల వస్తే 45 లక్షల మంది విద్యార్థులు చదువుకునేందుకు వసతులు ఉన్నాయి. సరైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెంచొచ్చు. ఇలాంటి అంశాలపై రాష్ట్ర మహాసభలలో చర్చించడం జరుగుతుంది.

విద్యా, వైద్యం ప్రభుత్వ ముఖ్య విధి. విద్యపై శ్రద్ధ పెట్టడం ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం కోసం మహాసభలు ఉపయోగపడతాయి‌‌. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఈ మహాసభలలో చర్చ జరుగుతుంది.ప్రైవేట్ రంగం అంటేనే అసమానతలు సృష్టించే కర్మాగారం, వ్యవస్థలుగా మారాయి. అన్ని ప్రైవేట్ బడులలో ఒకే రకమైన ఫీజులు లేవు అంతేకాకుండా విద్య కూడా వివిధ రకాలుగా ఉంటుంది. సిలబస్ రాష్ట్రమంతా ఒకే రకంగా ఉన్న ప్రైవేట్ రంగంలో విద్యను ఫీజులను బట్టి మార్చుతున్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించుట కోసమే ఈ రాజ్యాంగం అన్నారు. అంతరాలు పోవాలంటే ఒకే రకమైన విద్య కోసం ఒకే రకమైన బడులలో అందరూ చదవాలి.అసమానమైన విద్య అసమానతలను పెంచుతుంది అందుకే ప్రభుత్వం విద్యలో సమానత్వం కోసం కృషి చేయాలని అన్నారు. భారతదేశంలో ఢిల్లీ, కేరళ లాంటి రాష్ట్రాలు మాత్రమే విద్యలో ఉన్నత స్థితిలో ఉన్నాయని తెలిపారు. పాలకుల కుట్రల వల్లనే విద్యలో అంతరాలు ఏర్పడ్డాయని అంతరాలు లేని విద్య, నాణ్యమైన విద్య అందరికీ అందాలని, ఏకత్వంలో భిన్నత్వను అర్థం చేసుకునే విద్య విద్యార్థులందరికి ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో 2009 ఫిబ్రవరి 20, 21, 22 తేదీలలో యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి‌.

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ యుటిఎఫ్ ఏర్పడి 10 సంవత్సరాలు, యుటిఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నందున విద్య వైద్యానికి సభలను వైభవంగా జరపడం జరుగుతుందని విద్యా శ్రేయోభిలాషులందరూ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక సభలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విద్యా, వైజ్ఞానిక సభలకు ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించిందని ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు బి. అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి అరుణ, జిల్లా కార్యదర్శులు రమాదేవి, నలపరాజు వెంకన్న, పగిళ్ళ సైదులు, కొమర్రాజు సైదులు, వేదశ్రీ, ఆడిట్ కమిటీ కన్వీనర్ మురళయ్య , సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.శశిధర్, మైనార్టీ రెసిడెన్షియల్ రాష్ట్ర ఉపాధ్యక్షలు పయ్యావుల భరత్, సైదులు, జ్యోతి బాబు, సురేందర్ రెడ్డి, పగిడిపాటి నరసింహ, రమణ, రాజేష్, సంతోష , వివిధ మండలాల బాధ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.