Dandampally Saroja: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అనాదికాలంగా వస్తున్న దురాచారాలను ఎండగడుతూ భావిభారత మహిళలకు అక్షర జ్ఞానం నేర్పిన సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగించాలని అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ దండంపల్లి సరోజ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కతా ల్ గూడ ప్రాథమిక పాఠశాల లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు కతాలగూడ ప్రాథమిక పాఠశాల మహిళా టీచర్లకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారం మహిళలకు చదువు ఎందుకు అంటూ పురుష అహంకార ధోరణితో మరుగున పడిన స్త్రీ జాతి సమాజానికి దిక్సూచి గా నిలిచిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని అన్నారు.
మురికి కూపంలో మగ్గిపోతూ వంటింటి కుందేలుగా మార్చిన మహిళలను అక్షరాలు నేర్పించి జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినారనికొనియాడారు. పేదల బ్రతుకు చీకట్లను పారద్రోలి వెలుగు రేఖలతో మిరిమిట్లు గొలిపే అక్షరాలు నేర్పి అఖండఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాప్తింపజేసిన అపర మేధావి సావిత్రిబాయి పూలే అని అన్నారు.అక్షరం యొక్క ఆవశ్యకతను గుర్తించి మహిళల చదువుకు పునాదిలేసిన మొదటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆదర్శాలను నేటి సమాజం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనేక సామాజిక సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని అనే అనేకమార్లు విజ్ఞప్తి చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం అభినందనీయమని అన్నారు. మహిళా టీచర్లకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.
ఖాతాలగూడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.విజ యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు దండెంపల్లి సత్తయ్య, పనస చంద్రయ్య, మాజీ వైస్ చైర్మన్ పామనగుండ్ల కళావతి, మహిళా ఉపాద్యాయులు చాంద్ బి, రాణి, భవాని ,శైలజ, సునీత, అంగన్వాడి టీచర్ రమాదేవి ఉపాధ్యాయులు రాజశేఖర్, మధుబాబు, తదిత రులు పాల్గొన్నారు.