MGU: ప్రజాదీవెన, నల్గొండ : క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తెలంగాణ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ మరియు సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన విప్లవకారిణి సావిత్రిబాయి పూలే కు ఘన నివాళులు అర్పించారు.ఆర్ట్స్ కళాశాల వేదికగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ డా మద్దిలేటి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పరివర్తనకు విద్యను సాధనంగా మలచి యావత్తు దేశ గర్వించదగ్గ స్ఫూర్తిదాయకమైన పాత్రను ఆమె పోషించారన్నారు.
ఎన్నో అవమానాలు అవరోధాలను అధిగమించి, అజ్ఞానం మూఢత్వం, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు వంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారన్నారు. ధీశాలిగా ధిక్కారస్వరంగా , దయామయిగా భిన్న పార్శ్వాల్లో కృషి చేస్తూ సమ్మేళిత సమాజం కొరకు అనునిత్యం తపించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ డా మారం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ప్రకోపించి మార్పును సాధించే సాధనం విద్య అని, ప్రతి ఒక్కరూ మహనీయుల చరిత్రలను అధ్యయనం చేసి వారి స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా దోమల రమేష్, జి. నరసింహ, అనిత, సబీనా హరాల్డ్, కళ్యాణి పాల్గొన్నారు.
సైన్స్ కళాశాల నివేదికగా ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీన్ ఆచార్య కె వసంత హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అసమానతలు అణచివేతల కాలంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి అసామాన్యమైన పోరాట స్ఫూర్తి జ్వాల సావిత్రిబాయి పూలే అన్నారు. ధైర్య సాహసాలు దార్శనికతతో అనేక విద్య సామాజిక సంస్థలు స్థాపించి భారత సామాజిక యవనికకు నాంది ప్రస్తావన కావించారన్నారు. నేడు ఉన్నత విద్యలో ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి నాటి మహనీయుల కృషి ఫలమే అన్నారు. ఈ కార్యక్రమంలో డా మద్దిలేటి, డా మాధురి, డా తిరుమల, డా రూప, డా సత్తిరెడ్డి, డా మచేందర్, డా రాంచందర్ గౌడ్, కళ్యాణి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.