Gutta Sukhender Reddy: ప్రజాదీవె విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి వారి ఆలోచన విధానాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న డాన్ బోస్కో ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్, గణిత మరియు పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రదర్శనలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో సైన్స్ కు పోటీ పెరుగుతున్నదని అన్నారు. సైన్స్ ఆధారంగానే జీవన విధానం మారుతున్నదని, ఆధునిక వ్యవసాయ రంగంలో సైన్స్ ది కీలకపాత్ర అని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంలో మానవ వనరులను తగ్గిస్తూ గిట్టుబాటు ధరలు ఏ విధంగా సాధించాలో రైతులు అవలంబిస్తున్నారని, గతంలో వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేదని, శాస్త్రవేత్తలు వివిధ రకాల యంత్ర పరికరాలు, పనిముట్లు కనుక్కోవడం వల్ల ప్రస్తుతం వ్యవసాయం చాలా సులభమైందని తెలిపారు.
బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సబ్జెక్టుగా ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ తెలిపారు. సైన్స్, గణితం, పర్యావరణం, కమ్యూనికేషన్ తదితర ముఖ్యమైన 7 అంశాలు మనిషి చుట్టూ ముడిపడి ఉన్నాయని, జిల్లా స్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 236 ప్రాజెక్టుల ను 2000 మంది విద్యార్థులు సందర్శించడం అభినందనీయమని తెలిపారు .భవిష్యత్తు శాస్త్రవేత్తలను తయారు చేయడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని, విద్యార్థుల సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీసి వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, విద్యార్థుల ఆలోచన విధానాన్ని పెంపొందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధనత ఇస్తున్నదని, ఇందులో భాగంగా బడ్జెట్లో ప్రతి సంవత్సరం 21 వేల కోట్ల రూపాయలను విద్య పై ఖర్చు చేస్తున్నదని, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థను అమలు చేస్తున్నదని, రాష్ట్రవ్యాప్తంగా 28 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు .
శాస్త్ర సాంకేతికత పెరుగుతున్న కొద్దీ లాభాలు, నష్టాలు రెండు ఉన్నాయని ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ జిల్లాలు ఉండడం, అన్ని వసతులు ఉండడం, ట్రాన్స్పోర్ట్ తో పాటు, రవాణా ,రోడ్డు మార్గాలు పెంపొందడం ఉన్నప్పటికీ నల్గొండ జిల్లాలో తక్కువ అక్షరాస్యత ఉందని అన్నారు.అక్షరాస్యత తక్కువ ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడమే కాకుండా ప్రత్యేక నిర్ణయాలతో ఆ మండలాలలో వసతులను కల్పించి అక్షరాస్యతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, 26 వేల పాఠశాలలు ఉన్నాయని, 6000 పాఠశాలలు మూతపడే పరిస్థితిలో ఉన్నాయని, గురుకులాలలో ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, డ్రాప్ అవుట్లను తగ్గించి విద్యార్థుల సంఖ్యను పెంపొందించడంపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని అన్నారు.జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, ప్రదీప్ ఫౌండేషన్ సీఈఓ గోనా రెడ్డి ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతిలు మాట్లాడారు.
మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపల్ బాలశౌరి రెడ్డి, గుమ్మలమోహన్ రెడ్డి, స్వామి గౌడ్ , బషీరుద్దీన్, వెంకటేశ్వర రావు , హరికృష్ణ, గోపాల్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.