Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Youtuber Sucide: జర్నలిస్ట్‌ ముఖేశ్‌ హత్యలో భయానక విషయాలు వెలుగులోకి !

Youtuber Sucide: ప్రజా దీవెన, హైదరాబాద్:ఛత్తీగఢ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ హత్య ఘటన దేవవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో రోజుకో కీలక అంశంపై వెలుగు చూస్తోంది.లిక్కర్ అమ్మకం, మెకానిక్‌గా పనిచేయడం నుంచి జర్నలిస్ట్‌గా యూట్యూబర్‌గా ముఖేష్ జీవితం ప్రారంభమైంది. జర్నలిజంపై ఉన్న ఆసక్తితో ఎన్నో అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అదే విధంగా ముఖేష్ బట్టబయలు చేసిన ఒక రిపోర్ట్ అతడి మరణశాసనమైంది. సొంత బంధువే అతడిని హతమర్చేలా చేసింది.

రూ.120 కోట్లు విలువైన కాంట్రాక్టులో అవినీతిని బయటపెట్టినందుకు హత్యకు గురైన జర్నలిస్టు ముఖేశ్‌ కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగుచూస్తున్నాయి.

హంతకులు అతడిని దారుణంగా కొట్టి.. గుండెను చీల్చి బయటకు తీసినట్లు శవ పరీక్షల్లో తేలింది. ఇప్పటికే నిందితుడిని ఆదివారం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

ముఖేశ్‌ మృతదేహానికి డాక్టర్లు శవ పరీక్షను ముగించారు. అతడి కాలేయం నాలుగు ముక్కలైనట్లు గుర్తించారు. అంతేకాదు.. అతడి పక్కటెముకలు ఐదు చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. అతడి గుండెను చీల్చినట్లు తేలింది. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయానక హత్యను ఎన్నడూ చూడలేదని డాక్టర్లు వెల్లడించారు. ఇద్దరు కంటే ఎక్కువమందే ఈ హత్యలో పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు.

బస్తర్‌కు చెందిన ముకేశ్‌.. అదే ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కథనం వెలువరించాడు. తొలుత రూ.50 కోట్ల టెండర్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. పూర్తిస్థాయి అభివృద్ధి జరగకపోయినప్పటికీ రూ.120 కోట్లకు చేరుకుందని వెల్లడించాడు. అనంతరం అతడు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్‌ సురేశ్‌ చంద్రకర్ ఇంటి ఆవరణలోని సెప్టిక్‌ ట్యాంక్‌లో శవమై కనిపించాడు. పచ్చబొట్టు ఆధారంగా అతడిని గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో రితీష్‌, దినేషలు మృతుడికి బంధువులే.

హైదరాబాద్‌లో కీలక నిందితుడి అరెస్ట్‌..

ముఖేశ్‌ కేసులో కీలక నిందితుడైన కాంట్రాక్టర్‌ సురేశ్‌ చంద్రకర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అతడు ముకేశ్‌కు దూరపు బంధువు కూడా. హత్య జరిగిన రోజు నుంచి సురేశ్‌ కూడా అదృశ్యం కావడంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు. చివరికి హైదరాబాద్‌లో తన డ్రైవర్‌కు ఉన్న ఇంట్లో అతడు నక్కినట్లు గుర్తించారు. ఇందుకోసం దర్యాప్తు బృందాలు 200 సీసీ కెమెరాలను, 300 మొబైల్‌ నెంబర్లపై నిఘా వేశారు.

ఇప్పటికే సురేశ్‌కు చెందిన బ్యాంక్‌ ఖాతాలను సీజ్‌ చేసి.. అక్రమంగా నిర్మిస్తున్న యార్డును ధ్వంసం చేశారు. అతడి భార్యను కూడా కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్‌ చేస్తున్నారు.

హత్య ఎలా చేశారంటే..

జర్నలిస్టు ముఖేశ్‌కు వరుసకు సోదరుడయ్యే రితీశ్‌, సూపర్‌వైజర్‌ మహేంద్రతో భోజనం చేసే సమయంలో వాగ్వాదం చోటుచేసుకొంది. దీంతో వారిద్దరూ తొలుత ఇనుప రాడ్డుతో దాడి చేశారు. దీంతో ముఖేశ్‌ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మహేంద్ర పర్యవేక్షణలో అతడి శరీరాన్ని సెప్టిక్‌ ట్యాంక్‌లో పడేసి.. సిమెంట్‌తో మూసివేశారు. అనంతరం ముఖేశ్‌ ఫోన్‌, దాడికి వాడిన ఇనుప రాడ్డును పారేశారు. ఈ హత్యకు సురేశ్‌ను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్నారు.