Collecter Tripati : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : పాముకాటు, కుక్కకాటు వల్ల ఎవరు చనిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులు, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆమె ఉదయాదిత్య భవన్లో పారిశుధ్యం,ఆరోగ్య విషయాల పై
వైద్య ఆరోగ్యశాఖ ,పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఇటీవల కాలంలో పాముకాటు, కుక్క కాటుకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్నదని, దీనికి కారణాలను విశ్లేషిస్తే ముఖ్యంగా గ్రామాలలో ఆహార పదార్థాలు ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల కుక్కలు పెరిగిపోయి ఆహార పదార్థాల కోసం ప్రజలపై దాడి చేసే పరిస్థితి వస్తుందని ,అందువలన పారిశుద్ధ్య లోపం లేకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పాముకాటు, కుక్కకాటుకు గురైన వారికి సరైన విధంగా చికిత్స అందించాలని ఏ ఒక్కరు పాముకాటు ,కుక్క కాటు వల్ల మరణించడానికి వీలులేదని తెలిపారు. ఈ విషయమై గ్రామస్థాయిలో పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వీటితోపాటు, మాతా శిశు మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. అలాగే ప్రజలు పాముకాటుకు, కుక్క కాటుకు గురికాకుండా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కుక్కలను చంపకూడదని, కోతులను చంపవద్దని, ఊరికి దూరంగా వదిలిపెట్టేలా మున్సిపాలిటీకి అప్పగించాలని చెప్పారు .కోతులను జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే వారు వాటిని తీసుకువెళ్లి అడవిలో వదిలి వేస్తారని చెప్పారు. వీటితోపాటు, గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, డాక్టర్లు సమయానికి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిరుపేదలకు మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వెలిమినేడు, అడవిదేవులపల్లి వైద్యాధికారులకు ఆమె అభినందనలు తెలియజేస్తూ ఇలా పని చేసిన డాక్టర్లకు పదివేల రూపాయల నగదు బహుమతి ని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నగదును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అందజేస్తామని వెల్లడించారు .
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ,డిప్యూటీ డిఎంహెచ్వోలు, ఎంపీడీవోలు, మండల వైద్యాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.