ఇల్లు మంజూరుచేయాలని సెల్ టవర్ ఎక్కి హల్చల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలో ఉద్రిక్తత
Indiramma houses : ప్రజాదీవెన, సిద్దిపేట జిల్లా : ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డుల్లో గ్రామ సభలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేర్లు వచ్చాయో లేదో చెప్తున్నారు. రానివారు దానికి కారణాలు తెలుసుకొని తిరిగి మళ్లి దరఖాస్తు సమర్పిస్తున్నారు. తాజాగా తనకు ఈ ఎంపిక ప్రక్రియలో అన్యాయం జరిగిందంటూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు.
నాకు న్యాయం జరిగే వరకు నేను దిగను
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక లచ్చపేట 11వ వార్డులో గ్రామ సభ నిర్వించారు. తమ వివరాలు అందులో వచ్చాయో లేదోనని అదే ప్రాంతానికి చెందిన మామిండ్ల రాజు అక్కడికి వచ్చాడు. అతని వివరాలు యాప్లో చెక్ చేయగా రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాజు తనకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రక్రియలో అన్యాయం జరిగిందంటూ సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ రమేశ్ ఘటనా స్థలానికి పోలీసులతో వచ్చారు. అతన్ని కిందకి దిగాలని కోరగా ‘తనకు న్యాయం జరిగేంత వరకు టవర్ దిగనని’ వారించాడు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తామని రాజుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంది.