ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
Sudarshan Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్: శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.శనివారం ఆయన హైదరాబాద్ నుండి టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని , ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ అందించాలని సి ఈ ఓ అన్నారు.
వరంగల్-ఖమ్మం- నల్గొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించి హోర్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3 న విడుదల చేయడం జరుగుతుందని , ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలని సీఈఓ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసిఎంసి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియాలలో వచ్చే ప్రసారాలను పరిశీలించాలని అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను, నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్ని జంబో బ్యాలెట్, నార్మల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సరి చూసుకోవాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం కు ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గుర్తించాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఎంసిసి బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, వీ.ఎస్.టి , వీ.వి.టి మొదలగు బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని, ఉమ్మడి ఖమ్మం -వరంగల్ -నల్గొండ టీచర్స్ స్థానానికి సంబంధించిన నామినేషన్ నల్గొండ కలెక్టరేట్లో స్వీకరించడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా అక్కడ అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై ఇది వరకే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను వివిధ నోడల్ కమిటీల ఏర్పాటు, బ్యాలట్ బాక్సులు, పి ఓ, ఏపీవో,సిబ్బందికి శిక్షణ, ఓటర్ జాబితా తదితర అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ సుదర్శన్ రెడ్డికి వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సోమవారం నుండి స్వీకరించనున్న నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అన్ని నోడల్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై ఆమె సూచనలు ఇచ్చారు.
అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ మిత్, జిల్లా అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.