Tripathi : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి వివిధ మాధ్యమాల ద్వారా జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ – ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (MCMC) మీడియా సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం సి ఎం సి ద్వారా ప్రతిరోజు వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే చెల్లింపు వార్తలు ,ఎన్నికల ప్రవర్తనా నియమావళి , వ్యతిరేక వార్తలు, అనుకూల వార్తలు తదితర వాటిని పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ద్వారా ముందస్తు అనుమతిని జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి చెల్లింపు వార్తలకు అవకాశం ఇవ్వకుండా చూడాలని కోరారు.
అలాగే మీడియా సెంటర్ ద్వారా ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించిన వార్తలను ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా కు చేరవేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసే నియమ, నిబంధనలను రాజకీయ పార్టీలతో పాటు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముందు విధించే సైలెన్స్ పీరియడ్ లో సైతం నిబంధనలు అన్నింటిని పాటించాలని ఆమె కోరారు.అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఎంసీఏంసి సభ్యులు కోటేశ్వరరావు, ఎంసీఎంసీ సభ్యులు శేషాచార్యులు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ తదితరులు ఉన్నారు.