Uttam Kumar Reddy :ప్రజాదీవెన, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్ లో బిసి కుల గణన సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ , పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు .
ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసి కుల గణన సర్వేను నిర్వహించిందన్నారు. అధికారులు తూతుమంత్రంగా కాకుండా ప్రామాణికంగా , పక్కాగా సర్వే నిర్వహించారని వివరించారు. తాను కూడా తన కుటుంబ వివరాలను తన సొంత గ్రామంలో అధికారులకు అందించినట్లు తెలిపారు. కావాలనే కొందరు ప్రతిపక్ష నేతలు అనుమానాలు, అపోహలు సృష్టించే విధముగా మాట్లాడుతున్నారని చెప్పారు.
ప్రజలు ఎవరు కూడా వారి మాటలను నమ్మవద్దని , అపోహలకు గురికావాల్సిన అవసరం అసలే లేదన్నారు. రాష్ట్ర , జిల్లా , మండల , గ్రామ స్థాయిలో అధికారులు , ప్రజా ప్రతినిధులు ప్రజలకు అర్ధం అయ్యే విధంగా గణాంకాలను వివరించాలని ఆయన సూచించారు. నిజమైన పేద వారికి సంక్షేమ పథకాలు అందాలి అంటే ప్రభుత్వ అధికారులు , ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా ఏపీఎల్, బీపీఎల్ రేషన్ కార్డ్స్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.