అభినందించిన మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కరుణాకర్, సిబ్బంది
CI Karunakar : ప్రజాదీవెన, నల్లగొండ: ఆల్ ఇండియా నేషనల్ కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ టీం కెప్టెన్ గా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న నౌషిన్ ఎంపికైంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 తేదీ వరకు కరీంనగర్లో జరిగిన తెలంగాణ పోలీస్ మూడవ స్టేట్ మీట్లో యాదాద్రి భువనగిరి జోన్ కెప్టెన్ గా వ్యవహరించి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో తెలంగాణ స్టేట్ పోలీస్ టీం కబడ్డీ కెప్టెన్ గా నౌషిన్ ను నియమించారు. పంజాబ్ రాష్ట్రంలో మార్చి 2 వ తేదీ నుంచి జరగనున్న ఆల్ ఇండియా నేషనల్ పోలీస్ కబడ్డీ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్ మంగళవారం నౌషిన్ ను అభినందించి శాలువాతో సత్కరించారు. ఆల్ ఇండియా కబడ్డీ స్పోర్ట్స్ మీట్ లో ఉత్తమంగా రాణించి నల్లగొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా, నౌషిన్ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలుమార్లు ప్రాతినిధ్య వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు ఈ. వెంకటేశ్వర్లు, బొల్లెద్దు వెంకటయ్య, సిబ్బంది షర్ఫుద్దీన్, శ్రీనివాస్, జలీల్, రమేష్, అనూష, మౌనిక, తదితరులు ఉన్నారు.