అక్రమ పట్టాచేసుకున్న కుమారుడిపై చర్యలు తీసుకోవాలి
క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాం.. కాపాడండి మేడం
నల్లగొండ కలెక్టర్ ను ఆశ్రయించిన బాధిత వృద్ధ దంపతులు
Collector Tripathi : ప్రజాదీవెన, నల్లగొండ క్రైం: తమకు తెలియకుండా అక్రమంగా పట్టాచేసుకున్న తన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని క్యాన్సర్ బారిన పడిన వృద్ధ దంపతులు సోమవారం నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆశ్రయించారు. ఈమె వారి సమస్యను సానుకూలంగా విని చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. బాధితులు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండతండా గ్రామానికి చెందిన భూక్యా జయరాం, మత్రిలకు ఇద్దరు కుమారులు బాలాజీ, గోవింద్ ఉన్నారు. జాయరాంకు ఉన్న 5 ఎకరాల భూమిని తలా 2ఎకరాలు చొప్పున ఇద్దరి పేరుతో పట్టా చేపించి, ఎకరం భూమి తమ పోషణకోసం ఉంచుకున్నారు. అప్పటికే వృద్ధ దంపతులు క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలో తమ చిన్న కుమారుడు గోవింద్ మాత్రమే వారి ఆసుపత్రుల ఖర్చులు, మందులు, పోషణ బాధ్యత తీసుకున్నాడు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు భూక్యా బాలాజీ, భార్య పద్మ వృద్ధ తల్లిదండ్రుల పేరుతో ఉన్న ఎకరం భూమి తన పేరుతో పోర్జరీ సంతకాలతో దొంగపట్టా చేపించుకున్నాడు. ఈ విషయం తెలిసిన చిన్నకుమారుడు కూడా వారి పోషణను పట్టించుకోవడం మానేశాడు. ఇదే విషయం నల్లగొండలో బాలాజీ నివసించే హ్యాపీ హోం దగ్గరకు వెళ్లి తల్లిదండ్రులు వెళ్లి అడగగా, దుర్భాషలాడుతున్నాడని చెప్పారు. చేసేదేంలేక బాధపడుతున్న వృద్ధులు నల్లగొండ కలెక్టర్ ను ఆశ్రయించారు. అయితే భూక్యా బాలాజీ నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని, అందుకే నల్లగొండ కలెక్టర్ ను ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. ఆమె తక్షణ చర్యలు తీసుకోవాలని నల్లగొండ ఆర్డీవోకు రెఫర్ చేయగా, ఆయన సూర్యాపేట ఆర్డీవో విషయం తెలిపి పూర్తి వివరాలు తెలుసుకుని, చర్యలు తీసుకోవాలని సూచించినట్లు బాధితులు తెలిపారు.