Donated organs : ప్రజాదీవెన, రుద్రంపూర్: తాను చనిపోతూ ఐదుగురుకి పునర్జన్మని ఇచ్చాడు ఓ కార్మికుడు.. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌కు చెందిన కిషోర్ (56)అనే కార్మికుడు ..సింగరేణిలో బొగ్గు లోడింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి పెళ్లి కాలేదు.. కుటుంబ సభ్యులతో నివసిస్తూ..ప్రతి రోజూ సింగరేణిలో విధులకు హాజరు అవుతున్నారు. తరచూ అనారోగ్యం పాలవుతుంటే..స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 8న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రవేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించినా కోలుకోలేదు.
ఈ నెల 15 న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. డాక్టర్ల సూచన మేరకు కిషోర్ కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు అంగీకరించడంతో ఒకరికి కాలేయం, ఇద్దరికి మూత్రపిండాలు, మరో ఇద్దరికీ కార్నియాలను అమర్చారు..మొత్తం ఐదుగురికి అవయవాలను దానం చేసి వారికి కొత్త ఊపిరి పోశారు. అనంతరం కిషోర్ మృతదేహాన్ని స్వగ్రామం కొత్తగూడెం తీసుకురావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుట్టెడు దు:ఖంలో ఉండి కూడా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. తాను చనిపోతూ కిషోర్ ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.