MLC Election : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :వరంగల్ ఖమ్మం నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎస్ సుందర్ రాజు యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్ అన్నారు. సోమవారం నల్లగొండలోని యాదవసంఘం భవనంలో జరిగిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు.వరంగల్ కేంద్రంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్న సుందర్ రాజు యాదవ్, అనేక మంది పేదపిల్లలకు ఉచిత విద్యను అందించడమే కాకుండా వారి ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. అటు టీచర్లు, ఇటు విద్యార్ధుల సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న సుందర్ రాజు యాదవ్ ను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా విద్యారంగ సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న యాదవ టీచర్లతో పాటు బహుజన అధ్యాకపకులందరూ సుందర్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు పలకాలనీ కోరారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధన వరకు సుందర్ రాజు యాదవ్ కుటుంబం అంతా ఉద్యమ నేపథ్యంతోనే ఉన్నారనీ, సమాజంలో అన్ని వర్గాల వారికి అండగా ఉంటున్న సుందర్ రాజ్ కు ఈ సమయంలో మనమంతా అండగా ఉండి గెలుపుకు క్రుషి చేయాలని పిలుపునిచ్చారు.
గొర్రెల కాపరుల సంఘం మాజీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సోమనబోయిన సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ గొర్రెల మందకు కాపలాగా తోడేళ్ళను పెట్టుకోవద్దని కోరారు. ఇప్పటి వరకు బహుజనులకు రక్షణగా అగ్రవర్ణాలను పెట్టుకుంటున్నామని, ఈసారి అయినా యాదవ బిడ్డకు మద్దతు పలకాలని కోరారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని కోరుకునే మనం, తీరా ఎన్నికల సమయానికి సంఘాల పేరుతో విడిపోయి మళ్లీ అగ్రవర్ణాలకే మద్దతు పలకుతున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. ఎంతో చైతన్యం ఉన్న నల్లగొండ జిల్లా తరపున సుందర్ రాజు యాదవ్ కు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. బహుజనవాదం పేరుతో కొంతమంది ద్వంద వైఖరితో గందరగోళం సృ ష్టించే ప్రయత్నం చేస్తున్నారనీ, ఉపాధ్యాయులకు అన్ని రకాలుగా శ్రేయోభిలాషి అయిన సుందర్ రాజుకే బహుజనులంతామద్దతివ్వాలన్నారు.
యాదవ భవన్ ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ వాదం, సామాజికవాదం బాగా పుంజుకుంటున్న సమయంలో ఒక యాదవ బిడ్డ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారనీ, ఆయనకు మద్దతివ్వడం ద్వారా బహుజనవాదాన్న నిలబెట్టాలని కోరారు. వరంగల్ జిల్లాలో సుందర్ రాజ్ యాదవ్ కుటుంబానికి ఉన్న ఉద్యమ చరిత్రను గమనంలో ఉంచుకొని భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు ఆలోచించి సుందర్ రాజు యాదవ్ కు ఓటేయాలని కోరారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లొడంగి గోవర్ధన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్ట మొదటిసారిగా ఒక యాదవబిడ్డ పోటీ చేస్తున్నాడని, ఈ అవకాశాన్ని చైతన్యవంతమైన ఉపాధ్యాయులు ఉపయోగించుకొని బహుజనవాదాన్ని గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నల్లగొండ నియోజకవర్గ ఇన్ ఛార్జి ఎల్ వి యాదవ్, బహుజన రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు, యాదవ ఉద్యోగుల సంఘం నాయకులు గుండెబోయిన జానయ్య యాదవ్, యాదవ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేశ్ యాదవ్, కుంటిగొర్ల లింగయ్య, నల్లబెట్టి పురుషోత్తం యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, అబ్బనబోయిన ఏడుకొండలు యాదవ్, బురం గురవయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.