Earth Quake : ప్రజా దీవెన, హైదరాబాద్: భూకంపాలను ముందుగానే గుర్తించి, నియంత్రణా చర్యలకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినందుకు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనుమల్ల శ్రీధర్‌కు దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయినా ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఓయూలో జియోఫిజిక్స్‌లో పీజీ పూర్తిచేసి, ప్రొ. రామరాజ్ మాథుర్ మార్గదర్శకత్వంలో రీసెర్చ్ స్కాలర్‌గా భూకంపాల గుర్తింపునకు అధునాతన పద్ధతులు, విపత్తు నిర్వహణ సంసిద్ధత వ్యూహాలను మరింత బలోపేతం చేయడంపై శ్రీధర్ అధ్యయనం చేశారు. దేశంలోని ‘దక్షిణ అండమాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌లో షాలో యాక్టివ్ ఫాల్ట్ సిగ్నేచర్‌లను గుర్తించే రిమోట్ సెన్సింగ్ జియోఫిజికల్ టెక్నిక్స్’ అనే అంశంపై లోతైన పరిశోధన చేశారు.
భూకంపాలు రాక ముందే గుర్తించడమే ఈ అధ్యయనం లక్ష్యం కాగా, పోర్ట్ బ్లెయిర్ భూకంపం తర్వాత అధునాతన ఫాల్ట్ డిటెక్షన్ పద్ధతుల అవసరాన్ని తన పరిశోధన ద్వారా చాటి చెప్పారు. జియోలాజికల్ సర్వే కోసం అయస్కాంత, విద్యుదయస్కాంత పరికరాలను ఉపయోగించి సరికొత్త విధానానికి రూపకల్పన చేయగా, దీనిద్వారా భూకంప అంచనా, విపత్తుల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని సేకరించే వీలు కలిగింది. తన అధ్యయనం ద్వారా ప్రభుత్వ సంస్థలు విపత్తు నిర్వహణ బృందాలను ముందుగానే అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందని, అదేవిధంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను సంసిద్ధత వ్యూహాలను మెరుగుపరచడానికి కచ్చితమైన సమాచారంతో సన్నద్ధం చేయడానికి తోడ్ప డతుందని శ్రీధర్ పేర్కొన్నారు.