— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–అధికారులతో టెలి కాన్ఫరెన్స్
— అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచన
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబిసి, ఈడబ్ల్యుఎస్ వర్గాలలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద ఆర్థిక సహాయం అందించేందుకుగాను ఉద్దేశించి అమలు చేయనున్న రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను, గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో టామ్ టామ్ నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా, రాజీవ్ యువ వికాస పథకం పై మాట్లాడుతూ ఈ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలకు 21 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వ్యవసాయేతర పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు 21 నుండి 55 సంవత్సరాల వరకు వయస్సున్నవారు అర్హులని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 వార్షిక ఆదాయం, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. ఈ పథకం కింద యూనిట్ పరిమితి 50 వేల నుండి 4 లక్షల వరకు ఉందని,50 వేల యూనిట్ కు దరఖాస్తు చేసుకున్న వారికి 100 శాతం సబ్సిడీ వస్తుందని, 50వేల ఒక రూపాయి నుండి లక్ష రూపాయల వరకు 90 శాతం సబ్సిడీ ఉంటుందని, 10శాతం బ్యాంకు రుణం ఉంటుందని, లక్ష 1 రూపాయి నుండి 2 లక్షల రూపాయల వరకు 80 శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాంకు రుణం ఉంటుందని, రెండు లక్షల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ,30 శాతం బ్యాంకు రుణం ఉంటుందని తెలిపారు. చిన్ననీటిపారుదల పథకాలకు 100శాతం సబ్సిడీ ఉంటుందని, అత్యంత దుర్భల సమూహాలకు లక్ష రూపాయలవరకు 90 శాతం సబ్సిడీ వస్తుందని ఆమె వెల్లడించారు.
అభ్యర్థులు దరఖాస్తు తో పాటు, ఆయా యూనిట్లకు సంబంధించి ఆధార్ కార్డు,రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ బుక్, సదరం ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దుర్భల సమూహలైతే అలాంటి దృవపత్రం జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక కుటుంబానికి ఐదేళ్ల కాలంలో ఒకే సంక్షేమ పథకానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, మొదటిసారి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి మహిళలు, దివ్యాంగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు, ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను దృవపత్రాలతో జత చేసి సంబంధిత ఎంపిడిఓ కార్యాలయాలలో మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో అయితే మున్సిపల్ కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో అందజేయాలని పేర్కొన్నారు. గతంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు అన్ని పత్రాలను జత చేసి దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఇవ్వాలని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకానికి వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలించిన మీదట మండల స్థాయి కమిటీ జాబితాను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపిస్తుందని, జిల్లా స్థాయి కమిటీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబితాను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తుందని ఆమె తెలిపారు. అందువల్ల జిల్లాలోని అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ఈబిసీ వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.