–ధరణితో అవస్థలు పడ్డ రైతులు
–పూర్తిస్థాయిలో పరిష్కారం కాని సాదాబైనామాలు
–భూ భారతిపైనే రైతుల ఆశలు
–రాష్ట్రంలో నాలుగు మండలాలు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక
–నేడు నల్గొండ జిల్లా కు రెవెన్యూ శాఖ మంత్రి రాక
–ఇప్పటికే మండలాల్లో ఎమ్మెల్యేలతో కలిసి రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్
Bhubharathi :ప్రజాదీవెన నల్గొండ :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలుపుతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీల తో పాటు ఇచ్చిన హామీల్లో ధరణిపోర్టలు రద్దుచేయడం ఒక హామీగా ఇచ్చారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ధరణి పోర్టల్ ను రద్దుచేయడానికి, బంగాళాఖాతంలో కలపడానికి ఏడాదికిపైగా సమయం పట్టింది. ఏదేమైతేనేం మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ధరణి పోర్టల్ రద్దుచేశారు. భూభారతి చట్టని అమలులోకి తెచ్చారు. భూభారతిని అమలుచేసేందుకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని పలు మండలాలలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి భూభారతి చట్టం పై అవగాహన కల్పిస్తున్నారు. కాగా నేడు రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలానికి వస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేయబోతున్న భూభారతి చట్టం 2025 పై రైతులకు అవగాహన కల్పించి అమలుచేసే దిశగా నిర్దేశం చేయనున్నారు.
భూ భారతి తో భూవివాదాలకు చెక్ పడినట్లేనా..?
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ధరణి పోర్టల్ తో ప్రతి గ్రామంలో ప్రతిరైతుకు ఏదో ఒక
సమస్య ఎదురైంది. ఏ ఒక్కరికి కూడా ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు ఉన్న భూములు ధరణి పోర్టల్ రాకతో అటవీ భూములుగా, ప్రభుత్వ భూములుగా, బీనాం భూములుగా, సీలింగ్ భూములుగా ఇలా రకరకాల కారణాలతో రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి కూడా భూ సమస్యలే ఎక్కువగా రావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల తో పాటు ఇతర హామీలు ఇచ్చినప్పటికీ, ధరణి పోర్టల్ ను రద్దుచేసి బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నరు. అయితే ప్రస్తుతం దశాబ్దాలుగా కూరుకపోయిన భూసమస్యల పరిష్కారానికి భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందనే భరోసాను రైతులకు కలిగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. పెండింగ్ లో ఉన్న భూ సమస్యలన్నీ
భూభారతి చట్టం ద్వారా పరిష్కారమవుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మొదలైన అవగాహన సదస్సులు…
భూభారతి చట్టం తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత గొప్ప పథకంగా ప్రజల్లోకి, ముఖ్యంగా రైతుల్లోకి తీసుకపోతున్నది. చాలా ఏండ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలకు భూభారతి పరిష్కారం చూపుతుందని, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టం అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నియోజకవర్గ ఎమ్మెల్యేలు రైతులకు చెబుతున్నారు. భూభారతి చట్టని తీసుకొచ్చిన నాటి నుండి జిల్లా కలెక్టర్ త్రిపాఠి నిరంతరయంగా నల్లగొండ జిల్లాలోని నియోజక వర్గాలలో పర్యటనలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ధరణితో ఏమి కోలుపోయారు.. భూభారతితో ఏం పొందనున్నారు… అనే విషయంపైన జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, జిల్లా, మండల అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి భూభారతి ప్రత్యేతను, ప్రాముఖ్యతను, పెండింగ్ సమస్యలకు పరిష్కారం ఏవిధంగా లభిస్తుందో.. అర్ధమయ్యేలా వివరిస్తున్నారు.
17 నుండి నిరంతరాయంగా…
ఈనెల 17న నల్లగొండ జిల్లాలోని దేవరకొండ లో గల చింతపల్లిలో భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజలకు అవగాహన కల్పించారు. అదే రోజు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తోకలిసి దేవరకొండ తో పాటు కొండమల్లేపల్లిలో అవగాహన కల్పించారు. 19న నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, హాలియా లో ఎమ్మెల్యే జై వీర్ రెడ్డితో కలిసి అవగాహన కల్పించారు. 20న నల్లగొండ మండలం దోమలపల్లి, అదేవిధంగా తిప్పర్తి మండలం లో భూ భారతి చట్టంపై జిల్లా కలెక్టర్ త్రిపాటి ప్రజలకు అవగాహన కల్పించారు.
భూభారతి తో పెండింగ్ సాదాబైనామాలకు మోక్షం..
సాదా బైనామాలను క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. సాదాబైనామాలతో పట్టాలు ఇవ్వడంతో మెజార్టీ రైతులకు మేలు జరిగింది. అయితే పూర్తిస్థాయిలో సాదాబైనామాలు క్రమబ కాలేదు. రైతులు తమ సమస్యలను పరిష్కరించు కోలేకపోయారు. 2020 లో మరోసారి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రైతుల నుంచి దరఖాస్తులు కోరారు. లక్షల సంఖ్యలో సాదా బైనమాలు పరిష్కారం కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. కానీ వాటికీ పరిష్కారం మాత్రం చూపలేదు. ఇలోగా ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ అమలుచేసిన ధరణి పోర్టల్ రద్దు కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే పెండింగ్ ఉన్న సాదాబైనామాలకు, ఇతర రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖల మధ్యలో ఉన్న వివాదాస్పద భూములు భూభారతితో పరిష్కారం అవుతుందని ఆశగా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురుచూస్తున్నారు.
నేడు జిల్లాకు రెవెన్యూ మంత్రి…
భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాకు రానున్నారు. జిల్లాలోని చందంపేట మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మంత్రి ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరి 10:30 గంటలకు చందంపేట చేరుకొని 12 గంటల వరకు భూభారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారు. అయితే కార్యక్రమానికి ప్రజలు, రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని కలెక్టర్ త్రిపాఠి కోరారు.