Terror Attacks : ప్రజాదీవెన నల్గొండ :పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గురువారం రాత్రి పహల్గామ్ ఉగ్రదాడులను ఖండిస్తూ నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల పిరారెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మిల్ట్రీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారని కథనాలు వెలువడుతున్నాయని, ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకొని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తులు తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నాయి.
ఉగ్రదాడులను దేశంలోని ముస్లింలను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. గత పది సంవత్సరాలుగా బిజెపి ఉగ్రవాదాన్ని నిర్మూలించామని చెప్పుకుంటున్న గొప్పల డొల్లతనం బయటపడిందని విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాలలకు కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతోన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాశం, సిహెచ్. లక్ష్మీనారాయణ, మహమ్మద్ సలీం, పి. నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, మల్లం మహేష్, పరిపూర్ణాచారి, వెంకన్న, అశోక్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఉమా, రవి, నరసింహ, నరేష్, శివ, మధు తదితరులు పాల్గొన్నారు.