–బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్
Telangana Martyrs History :ప్రజాదీవెన నల్గొండ టౌన్ :తెలంగాణ వీరుల చరిత్ర సామాజిక చైతన్యానికి నూతన దిక్సూచి అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, నల్లగొండ జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవితాన్ని ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్న సినిమా పోస్టర్ను ఆవిష్కరించినట్లు తెలిపారు.
ఇది ఒక పోస్టర్ మాత్రమే కాదు.ఇది తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను మేల్కొల్పే ఉద్యమం అని పేర్కొన్నారు..దొడ్డి కొమరయ్య వంటి యోధులు ఆత్మగౌరవం కోసం, రైతుల స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించారు. ఈ వీరుల చరిత్రను మళ్లీ జీవింపజేయడమే మన నైతిక బాధ్యత అని అన్నారు. బీసీలు చరిత్రలో మాత్రమే కాక, భవిష్యత్తులోనూ నాయకత్వం వహించాల్సిన సమయం ఇది. యువతా! కీబోర్డ్ పోరాటాలు కాదు. రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయండి. సమాజాన్ని మార్చాలంటే మీ పాత్ర కీలకం అని పేర్కొన్నారు. మహిళలూ దొడ్డి కొమరయ్యలతో పాటు పోరాడిన తెలంగాణ తల్లుల గౌరవాన్ని నిలబెట్టాలంటే రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. మేధావులూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఎదుర్కోవాలని, నిజాయితీకి నిలబడి, సమాజాన్ని అక్షరాల ద్వారా శక్తివంతం చేయలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బుడిగపాక సత్యనారాయణ, నాగార్జునసాగర్ బీసీ సమాజ్ కో కన్వీనర్ చిట్టిమల్ల సర్వేశ్, కోమల్ల వెంకటేశ్వర్లు, బీసీ సమాజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.