Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం

సిఎం, మంత్రులు, బిఆర్ఎస్ నేతల సంతాపం

గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం

సిఎం, మంత్రులు, బిఆర్ఎస్ నేతల సంతాపం

*ప్రజా దీవెన:* తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్ వి. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏళ్ల సాయిచంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.కాగా, అర్థ రాత్రి గుండెపోటుకు గురవడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తరలించాలని సూచించారు. వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయారు.

సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.ఎక్కడ బీఆర్ఎస్ సభ జరిగినా, కేసీఆర్ మీటింగ్ ఏర్పాటైనా.. అక్కడ సాయి చంద్ పాట ఉండాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఊపు తెచ్చిన గాయకుల్లో సాయిచంద్ ఒకరు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు. పీజీ వరకు చదవిన సాయిచంద్.. విద్యార్థి దశ నుంచే మంచి కళాకారుడిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

అమరుడు శ్రీకాంతాచారి చనిపోయినపుడు పాటతో సాయి చంద్ అందరికీ పరిచయం అయ్యారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటతో సాయిచంద్ ప్రజల్లు ఉద్యమ స్పూర్తిని రగిలించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు. సాయిచంద్ ప్రతిభను, అంకిత భావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను 2001 డిసెంబర్‌లో టీఎస్ వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.

సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.

మంత్రి హరీశ్ రావు గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సాయిచంద్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఎంపీ సంతోశ్ కుమార్ కూడా కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. సాయిచంద్ మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.