–ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు
–నల్లగొండ జిల్లాలో 33 మండలాలు, 566 రెవెన్యూ గ్రామాలు
— 28 వేల సాదా బైనమా.. 16 వేల ధరణి సమస్యలు
— అధికారుల దృష్టికి రానివి ఇంకెన్నో.?
–తొలి రోజు 55 గ్రామాలలో సదస్సులు వచ్చిన 3263 దరఖాస్తులు
— సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు
రెవెన్యూ సేవలను సరళతరం చేయడంతో పాటు భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇదివరికే దీనిపై నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైలట్ ప్రాజెక్టు కింద జిల్లాకో మండలాన్ని ఎంపిక చేశారు. ఈమేరకు నల్గొండ జిల్లాలో నకిరేకల్ మండలం ఎంపిక కాగా అక్కడ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మంగళవారం సదస్సులు ప్రారంభమయ్యాయి. ఈ సదస్సులు ఈనెల 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.అయితే నల్గొండ జిల్లాలో భూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. పట్టాలు ఉన్న ఆన్లైన్ లో పేర్లు నమోదు కాకపోవడం, విస్తీర్ణంలో తేడాలు, ఆధార్, సర్వే నంబర్లు తప్పడం, విరాసత్, డిజిటల్ సైన్ కాకపోవడం, కొందరు.. రాజకీయ పలుకుబడి, ఆర్ధిక బలం, రియల్ఎస్టేట్ వ్యాపారులు కొందరి అమాయకత్వాన్ని అసరా చేసుకొని అక్రమంగా పట్టాలు చేసుకోవడం. ప్రభుత్వ దేవాదాయ భూములు ఆక్రమిస్తున్న సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం బాధితులు ఏళ్ల తరబడి కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ధరణీ స్థానంలో భూభారత చట్టాన్ని అమ్మల్లోకి తెచ్చింది. ఈ మేరకు అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తుల స్వీకరించి పరిష్కరించేందుకు సిద్ధమైంది. కాగా ఈ సదస్సులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.
Land Disputes : ప్రజాదీవెన , నల్గొండ : నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం నుండి ఈ నెల 20వ తేదీ వరకు భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా పెద్ద మండలం ఉంటే 30వ తేదీ వరకు కూడా పొడిగించే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లాలో 33 మండలాలు, 868 గ్రామ పంచాయతీలు, 566 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే పైలెట్ ప్రాజెక్టు కింద నకిరేకల్ మండలంలో అధికారులు సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఇక మిగిలిన 32 మండలాల్లోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రతి మండలంలో రెండు బృందాలుగా ఏర్పడి ఒక రోజులో రెండు గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వివిధ స్థాయిల అధికారులతో కలిసి బృందాలుగా ఏర్పాటయ్యారు. సీనియర్ అసి స్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సర్వేయర్, ఆర్ఐ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.
—32 మండలాలు.. 566 రెవెన్యూ గ్రామాలు..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 33 మండలాలు, 868 గ్రామపంచాయతీలు, 566 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ధరణి సమస్యలు 16 వేలు ఉండగా, సాదా బైనమా దరఖాస్తులు 28 వేలు పెండింగ్ లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.అయితే గ్రామస్థులు తమ వద్ద ఉన్న భూపత్రాలు, పహాణీలు, లింక్ డాక్యుమెంట్లు ఆర్వోఆర్ 1987-88 పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను అధికారులు విభాగాల వారీగా.. అంటే సర్వే నంబర్ల సవరణ, మిస్సింగ్ సర్వే నెంబర్లు, విరాసత్, మ్యూటేషన్ ఇలా విభజించి అంతర్జాలం లో నమోదు చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరిస్తారు.
—ప్రధాన భూ సమస్యలు ఇవే..
గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక రకాల భూసమస్యలను ఎదుర్కొ న్నారు. భూమి ఎక్కువ, తక్కువగా ఉండటం, ఒకరి పేరు మీద కాకుండా మరొకరి పేరు మీద
నమోదై ఉండటం, సర్వే నంబర్లు మిస్ కావడంతో పాటు నిషేధిత జాబితాలో పడటం తదితర భూ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే అధికారులు ధరణిలో పరిష్కారం కాని సమస్యలను గుర్తించారు. ఈ మేరకు నల్గొండ జిల్లావ్యాప్తంగా 16 వేలకు పైగా ధరణి సమస్యలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
—అన్ని రకాల సౌకర్యాలు..
సదస్సుల నిర్వహణలో భాగంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వసతుల కల్పన తో పాటు హెల్త్ క్యాంపులు, నీడ సౌకర్యం, హిల్స్ డెస్క్ పాటు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. రైతులకు అవసరమయ్యే దరఖాస్తు పారాలను అందుబాటులో ఉంచనున్నారు. సదస్సు నిర్వహించే ముందురోజు ప్రచారం చేయనున్నారు.
—తొలి రోజు 3263 దరఖాస్తులు..
రెవెన్యూ సదస్సులలో భాగంగా మొదటి రోజైన మంగళవారం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 55 గ్రామాలలో సదస్సులు నిర్వహించగా 3263 దరఖాస్తులు వచ్చాయి.
—ప్రజల వద్దకే…
ప్రభుత్వం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న తరుణంలో ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తు ఫారాలను అందించనుంది. ఈ మేరకు భూ సమస్యలకు సంబందించిన బాధితులు
దరఖాస్తు పత్రాన్ని తీసుకుని అందులో పూర్తి వివరాలను నింపి అధికారులకు అందజేయాలి. సాధారణ పద్దతి మాదిరి గా ఎలాంటి తెల్ల పేపర్ పై దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన అవవరం లేదు. అధికారులకు సమస్యను వివరించి దరఖాస్తు పత్రంలో వివరాలు నమోదు చేసి అందించాలి.
—తీరనున్న ఇబ్బుందులు..
ధరణి భూ సంబంధిత సమస్యలతో ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు పెట్టుకుంటున్న వారికి రెవెన్యూ సదస్సులు కొంత మేర ఉరట కల్పించనున్నాయి. అధికారులు గ్రామానికి వస్తున్న క్రమంలో ప్రజలు కలెక్టరేట్ కు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లేందుకు అస్కారం లేదు. అయితే భూ సమస్యలు ఈ రెవెన్యూ నదస్సులోనైనా పరిష్కారం అవుతాయో లేదో వేచిచూదాం.
—సద్వినియోగం చేసుకోవాలి..
గ్రామాలలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి రోజు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహిస్తున్నారని, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏయే గ్రామాలలో సదస్సు నిర్వహించాలో ప్రణాళికలు రూపొందించబడ్డాయని తెలిపారు.