Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ys sharmila : వైయస్ షర్మిలకు షాక్

--వైసీపీ నుంచి తల్లి విజయమ్మ పోటీకి సన్నాహాలు --తాజాగా మారిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు --ఉత్కంఠ భరితంగా వైఎస్ కుటుంబ వ్యవహారాలు

వైయస్ షర్మిలకు షాక్

–వైసీపీ నుంచి తల్లి విజయమ్మ పోటీకి సన్నాహాలు
–తాజాగా మారిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు
–ఉత్కంఠ భరితంగా వైఎస్ కుటుంబ వ్యవహారాలు

ప్రజా దీవెన/అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు నానాటికీ ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. ఓ వైపు టీడీపీ, జనసేన జట్టు కట్టి కలసి పోటీ చేస్తామని ఆ రెండు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మరో వైపు ఈ కూటమిలో బీజేపీ చేరుతుందో లేదే అనే అనుమానా లు కొనసాగుతున్నాయి. ఇక వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగడం,  ప్రస్తుతం వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెరసి ఇబ్బందికర పరిస్థితులు చెప్పుకోదగ్గట్టుగానే ఎదురవుతున్నాయి.

ఆమె కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నేరుగా తన అన్న, సీఎం వైఎస్ జగన్‌‌ను ఆమె టార్గెట్ చేశారు. రోజురోజుకూ జగన్‌పై షర్మిల ఘాటైన విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీకి కొంత ఇరకాట సమస్య ఎదురవుతోంది. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు ఇస్తున్న వైసీపీ నేతలు ఈ ఒక్క విషయంలో కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

షర్మిల కొన్నాళ్ల వరకు వైసీపీలోనే ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ కోసం తెలంగాణలో, ఏపీలో పాదయాత్ర చేశారు. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని బలోపేతం చేయడంలో షర్మిల కృషి ఎంతో ఉంది. అలాంటి షర్మిలపై విమర్శలు చేస్తే అవి తమకు ఎదురు తగిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో షర్మిల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.

ఇప్పటికే తమ కుటుంబాన్ని కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు విడదీశారని, తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని జగన్ నేరుగా విమర్శలు చేశారు. అయితే షర్మిలకు షాక్ ఇచ్చేలా జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన తల్లి విజయమ్మను వైసీపీ తరుపున పోటీ చేయించే ఎత్తుగడ చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ చనిపోయాక ఆ కుటుంబం రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

జగన్‌పై కేసులు, ఆయన 16 నెలలు జైలుకు వెళ్లడం, ఆ తర్వాత ప్రతిపక్షంలో వైసీపీ ఎన్నో సవాళ్లు చవిచూసింది. జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో, వాలంటీర్ల వ్యవస్థ, గ్రామసచివాలయాలతో ప్రజలకు నేరుగా చేరువయ్యారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. అందులో ప్రధానంగా షర్మిల చేసే విమర్శలు జగన్‌కు కంట్లో నలుసులా తయారయ్యాయి.

తల్లి, చెల్లిని పట్టించుకోవడం లేదని టీడీపీ, జనసేన విమర్శిస్తున్నాయి. ఇక షర్మిల అయితే తమ కుటుంబంలో గొడవలకు కారణం జగన్ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇలాంటి తరుణంలో వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక ఆమెను తన వైపు తిప్పుకుని వైసీపీ నుంచి పోటీ చేయిస్తే మేలనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమెను వైసీపీ నుంచి పోటీకి దింపితే షర్మిలతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు ఉంటుందని జగన్ అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే షర్మిలకు కోలుకోలేని షాక్ తగులుతుంది. ఇప్పటి వరకు ఆమెకు వెన్నంటే ఉన్న విజయమ్మ కీలకమైన ఎన్నికల సమయంలో వైసీపీ వైపు ఉంటే ప్రతిపక్షాలు విమర్శలకు అడ్డుకట్ట పడుతుంది. ఇక షర్మిల చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోరనే భావనకు వైసీపీ వచ్చింది. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.