Doddi Komarayya inspiration : ప్రజాదీవెన నల్గొండ : దొడ్డి కొమరయ్య స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బందులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి సభ ఉద్దేశించి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ నాటి వీరతెలంగాణ స్పూర్తితో సమస్యలు లేని తెలంగాణ కోసం ఐక్యంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, మన రాష్ట్రమునకు రావల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు.
కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాల అమలుకు రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, విధులను, నిధులను కుదిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవే సమస్యలు వెంటాడుతున్నాయని, ఆసమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందటంతో గత పాలకులను ఓడించారని, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత పాలకుల మాదిరిగా కాకుండా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణితోపాటు ప్రకటించిన నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లను రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని, ఇంటి స్థలంలేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వాలని, గతంలో ఇంటి స్థలాలల కోసం కొనుగోలు చేసిన భూమిని వారికే పంపిణి చేయాలన్నారు. వ్యవసాయ స్వల్పకాలిక రుణాల కింద రెండు లక్షలు మాఫి కానీ వారికి కొత్త వ్యవసాయ రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించాలని అన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న నగదును కూడా ఖరీఫ్ సీజన్ నుండే అమలు చేయాలన్నారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో ఆర్జీలు పెట్టుకున్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాలపరిమితి నిర్ణయించి పర్యవేక్షణ చేయాలన్నారు. జూలై 4 దొడ్డి కొమరయ్య అమరుడైన రోజును రైతురక్షణ దినంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ బందులో ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
1946 జూలై 4నాడు రోజున దొడ్డి కొమరయ్య నైజామ్ పోలీసులకు, భూస్వాములు గుండాలు పొట్టన పెట్టుకున్నారని అన్నారు. వీర తెలంగాణా సాయుధ పోరాటంలో తొలి అమరుడని పేర్కొన్నారు. ఈ పోరాటం 1946 నుండి 1951 వరకు జరిగిందన్నారు. నైజామ్ ప్రభుత్వం 1500 మందిని, యూనియన్ సైన్యాలు 2500 మందిని ఎర్రజండా ముద్దుబిడ్డలను పొట్టన పెట్టుకున్నాయని పేర్కోన్నారు. నేటి యువత గత చరిత్రను కూడా అధ్యయనం చేయాలని అన్నారు. పోరాటం ఫలితంగానే భూసమస్య రంగం మీదకు వచ్చిందన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, 3వేల గ్రామాలలో గ్రామ ప్రజారాజ్యాలను స్థాపించి భారత దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. ఈ సభలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున, ప్రభావతి, గంజి మురళీధర్, పి. నర్సిరెడ్డి, ఎండి. సలీం, దండెంపల్లి సత్తయ్య, సైదులు, కొండ అనురాధ, తుమ్మల పద్మ, కోట్ల అశోక్ రెడ్డి, పరిపూర్ణ చారి, రవి, బొల్లు రవింద్రకుమార్, సైదాచారి, నర్సింహా, మధు తదితరులు పాల్గొన్నారు.