–న్యాయకోసం వస్తే గన్మెన్లతో నెట్టి వేయించారని కలెక్టర్ పై ఆగ్రహం
–ఆర్డీఓ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న
–గిరిజనులంటే కలెక్టర్ కు ఇంత చులకనా అని ఆవేదన ?
–కలెక్టర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
–లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ నాయక్ డిమాండ్
Prajavani programme : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి వద్ద గిరిజనులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గిరిజన సంఘాల నాయకుల పై అనుచితంగా ప్రవర్తించిన కలెక్టర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గణేష్ నాయక్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే గత నెల జూన్ 6వ తేదీన గుడిపల్లి మండలం కేశంపల్లి తండా కు చెందిన ఝాన్సీ అనే మహిళ ప్రసవం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 12వ తేదీన ఝాన్సీకి ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు మృత శిశువుని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఝాన్సీ పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి అదే రోజు తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని, తల్లి కూడా చావు బతుకుల మధ్య ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గత నెల 13వ తేదీన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి ఝాన్సీ కుటుంబానికి తక్షణ సమయంలో రూ. 25000 అందిస్తామని ఝాన్సీ భర్తకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీవో హామీతో ఎల్ హెచ్ పి. ఎస్ నాయకులు ఆరోజు ఆందోళన విరమించారు.
—గిరిజనులంటే అంత చులకనా?
గిరిజనులు అంటే కలెక్టర్ కు అంత చులకన భావం ఉండడం సరైంది కాదని ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడు గణేష్ నాయక్, మహిళా హక్కుల సంఘం అధ్యక్షురాలు పునీబాయి అన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వస్తే సమాధానం చెప్పలేని కలెక్టర్ తన గన్మెన్లతో బయటికి వెళ్ళగొట్టమని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేంతవరకూ తాము కలెక్టర్ కార్యాలయాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. గిరిజనుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కలెక్టర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.