–ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్
Oil Venkat Swamy : ప్రజాదీవెన నల్గొండ : 2000 సంవత్సరంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం కేతపల్లి మండలం బొప్పారం గ్రామంలో సర్వే నెంబర్లు 175 నుండి 190 వరకు 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన చెట్టు పట్టాల ఆధారంగా 25 సంవత్సరాలుగా పేదలు సేద్యం చేస్తున్నారు. 1960లో మూసి ప్రాజెక్టుకు తమ భూముల్ని విక్రయించిన భూస్వాములు మళ్లీ భూముల పైకి వచ్చి పేదలను భయభ్రాంతులను గురి చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూశాఖ పేదలకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వం పేదలు సేద్యం చేస్తున్న అర్థ ఎకరానికి రైతుబంధు పట్టాలను ఇవ్వాలని ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేదలను ఉద్దేశించి మాట్లాడారు.
గత మూడు సంవత్సరాలుగా తప్పుడు రికార్డులతో పేదల భూమి తమదే అని భూముల హద్దులు చెరిపివేయడం, నీటి పైపులను ధ్వంసం చేయడం లాంటి వాటితో పేదలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను గ్రామానికి చెందిన తునికేష్ జగన్మోహన్ రెడ్డి తదితరులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.1952 ఖాసరా రికార్డును చూడడం కాకుండా 1960లో మూసి ప్రాజెక్టుకు వారు విక్రయించిన భూముల ఆధారంగా ఇవి పేదలవని రెవెన్యూ తేల్చాలని అయన అన్నారు. ప్రతిసారి భూస్వాములకు అవకాశం లేకుండా పేద ప్రజల భూములుగా వాటిని డిక్లేర్ చేయాలని ఆయన కోరారు.
1960లో మూసికి విక్రయించిన భూములను నీటిపారుదల శాఖ వీటిని సవాల్ చేసి నిలబడాలని భూస్వాములకు లొంగిపోవద్దని, రెవెన్యూ శాఖ ప్రత్యక్ష పరిశీలన జరిపి పేదల హక్కులను నిలబెట్టి రైతుబంధు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ ధర్నాలో ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) జిల్లా కార్యదర్శి దుర్గం జలంధర్, పి ఆర్ పి ఎస్ సి జిల్లా ఉపాధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్, దుర్గం మల్లయ్య, దుర్గం పరశురాములు, దుర్గం లింగయ్య, దుర్గం జానకి రాములు, దుర్గం కాశి రాములు, డంకెల మల్లయ్య, గుండగోని రాములమ్మ పేదలు పాల్గొన్నారు.