–జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి అనంత రెడ్డి
Officer Ananta Reddy : ప్రజాదీవెన నల్గొండ : ఆయిల్ ఫామ్ తో అధిక దిగుబడి ఆదాయం లభిస్తుందని, ఆయిల్ ఫామ్ తోటలను రైతులు సాగు చేసి లబ్ధి పొందాలని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి అనంత రెడ్డి తెలిపారు. ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా గురువారం నిడమనూరు మండలం వేంపాడు శివారుకు చెందిన రైతు ఏమి రెడ్డి లక్ష్మమ్మ వేణుధర్ రెడ్డి 11.5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలు ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తే 30 సంవత్సరాలు లాభాలని ఇస్తుందని అన్నారు.
చుట్టు పాల మొక్కను ఒకసారి నాటితే 4 వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడినీ తీసుకోవచ్చు. ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే ఈ పంటకు జంతువుల నుండి గానీ, దొంగల నుండి గానీ ఎటువంటి బెడద ఉండదు.
ఆయిల్ పామ్ వేసిన రైతు ఈ పంట నుండి ప్రతి నెల ఆదాయాన్ని తీసుకొనే సౌకర్యం కలదు. మిగతా పంటలతో పోల్చినపుడు ప్రకృతి వైపరీత్యాలను, చీడ పీడలను తట్టుకునే శక్తి చాలా ఎక్కువ అని తెలిపారు. ప్రభుత్వం నుండి ఈ పంట సాగుకు 100 శాతం రాయితీతో మొక్కలు సరఫరా చేస్తూ, మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలకు కూడా రాయితీ అందిస్తుందని, మొదటి నాలుగు సంవత్సరాలకు మొక్కల యాజమాన్యానికి ఎకరానికి 4200 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయబడుతుందని పేర్కొన్నారు. భూమి, నీటి వనరులు ఉన్న ప్రతీ రైతు సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఆయిల్ పామ్, ఉద్యాన పంటల వైపు రావాలని కోరారు. ఈ సందర్భంగా నిడమానూరు ఆర్టికల్చర్ అధికారిని రిషిత, పతంజలి కంపెనీ ప్రతినిధులు, గ్రామ రైతులు కలసి ఎకరానికి 57 మొక్కల చొప్పున 11.5 ఎకరాలలో మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు భరత్, ప్రసాద్, రాంప్రసాద్, సతీష్ డ్రిప్ కంపెనీ ప్రతినిధులు రాజశేఖర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.