ఎస్‌ఎస్‌ఏలో 704 ఒప్పంద ఉద్యోగాలు
పాఠశాల విద్యాశాఖలో నియామకాలకు పచ్చజెండా జులై 10వ తేదీన పోస్టింగ్ ఉత్తర్వుల జారీ
ఎస్‌ఎస్‌ఏలో 704 ఒప్పంద ఉద్యోగాలు
—పాఠశాల విద్యాశాఖలో నియామకాలకు పచ్చజెండా
—జులై 10వ తేదీన పోస్టింగ్ ఉత్తర్వుల జారీ
ప్రజా దీవెన/హైదారాబాద్ : విద్యాశాఖలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద 704 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు. ఈమేరకు డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సిస్టమ్ అనలిస్టులు, అసిస్టెంట్ ప్రోగ్రామర్లు తదితర పోస్టులను భర్తీ చేసేందుకు 2019 నవంబరులోనే విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబరులో రాత పరీక్ష నిర్వహించి.. 2020 జనవరిలో జిల్లాలవారీగా మెరిట్ ర్యాంకులను ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. 2022-23లో నియమించేందుకు విద్యాశాఖ మంత్రి దస్త్రంపై సంతకం చేశారు.
ఇక నుంచి రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే 2022 మార్చిలో ప్రకటించారు. దాంతో సీఎం కార్యాలయం సూచన మేరకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా విద్యాశాఖ నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 704 పోస్టులను భర్తీచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈమేరకు జులై 10న పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని, ఎంపికైనవారు 13వ తేదీలోపు కొలువుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన నిర్దేశించారు.
అధికార వర్గాలు మాత్రం ఎస్‌ఎస్‌ఏ అనేది ప్రాజెక్టు అని, శాశ్వత విభాగం లేదా శాఖ కాదని, అందువల్లే తీసుకుంటున్నట్లు చెబుతున్నాయి. కాగా గిరిజన ప్రాంతాల్లోనూ 50 శాతం నియామకాలను గిరిజనేతరులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020లో తీర్పు ఇచ్చింది. అలాగే 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని స్థానిక, స్థానికేతర అనేది నిర్ణయించాలని, ఆ మేరకు మెరిట్ జాబితాను ప్రకటించి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే కమిటీ నియామకాలను పూర్తిచేయాలని మార్గదర్శకాలు జారీచేశారు.
ఎంపికైన వారి నుంచి 2024 ఏప్రిల్ 24 వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాల్సి ఉంటుందని ఒప్పందపత్రాలు తీసుకోవాలని సూచించారు. వారు డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.