–మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy : ప్రజాదీవెన నల్గొండ : భవిష్యత్తు తరాల బాగును దృష్టిలో ఉంచుకొని వనమహోత్సవం కింద ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటడం తప్పనిసరి అని, రానున్న తరాలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు చెట్లే ఆధారమని, అందువల్ల ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని చెప్పారు. వనమహోత్సవం కింద జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రత్యేకించి ఆయా శాఖలు వాటి కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
వర్షాకాలం పూర్తయ్యలోపే మొక్కలు నాటడం పూర్తిచేయాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ మండలం, వెలుగు పల్లి గ్రామానికి చెందిన రిషికేశ్ పిడుగుపాటుకు మరణించగా వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తదితరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.